CM Chandrababu Assembly Speech: రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్థులకు చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం మాట్లాడారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని చంద్రబాబు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో క్రైమ్ పెరిగిపోయిందన్నారు. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడంతో నేరాలు జరుగుతున్నాయన్నారు.
అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి, డ్రగ్స్ సంబంధిత వాటిపై ఉక్కుపాదం మోపిందన్నారు. ఇక నుంచి ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అదే చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఎవరైనా భూకబ్జాలు చేసినా సహించమని హెచ్చరించారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టి వెళ్లారని, గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి పుట్టే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. కేవలం గుంతలను పూడ్చడానికి రూ.860కోట్లు విడుదల చేశామని చెప్పారు. రోడ్ల నిర్మాణానికి వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నామని, సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు తయారుచేస్తామన్నారు.
రూ.75వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. 30 నుంచి 40 వేల కోట్లపనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ. 72వేల కోట్లతో రాస్ట్రంలో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. అమరావతి రైల్వే లైన్‌కు కూడా కేంద్రం సహకరించిందన్నారు .