Site icon Prime9

AP Assembly: అరబిందోని వదలొద్దు..లెక్కల్లో 720.. నడిచింది మాత్రం 430 అంబులెన్స్‌లే!

AP Assembly about 108 vehicles: అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని సోమవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించలేకపోయాయని ఎమ్మెల్యే వెల్లడించారు. 34 లక్షల మందికి గాను 17.8 లక్షల మందికి గోల్డన్ అవర్ రీచ్ కాలేకపోయాయని ఆడిట్ జనరల్ తప్పుపట్టిన విషయాన్ని సభలో ఆయన చెప్పారు.

జనం సొమ్ము దోచేశారు
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న అరబిందో సంస్థ 430 అంబులెన్స్‌లు నడిపినా, కాగితాల మీద మాత్రం 720 వాహనాలు నడిపినట్లు చూపిందని టీడీపీ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మొత్తం అంబులెన్స్‌లలో 61 శాతం వాహనాలలో సెలైన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ల కొరతా ఉన్నట్లు కూడా గతంలో కాగ్ నివేదిక నిర్ధారించిందని వారు సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ, సభ్యుల వాదన నిజమేనని చెబుతూ, ఇప్పటివరకూ అరబిందోకు రూ.600 కోట్ల చెల్లింపులు జరిగాయని, ఇంకా రూ.800 కోట్లు పైచిలుకు చెల్లింపులు చేయాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై తప్పక విచారణ జరిపిస్తామని మంత్రి సభకు హామీ ఇచ్చారు.

ఇదీ జరిగింది..
వైసీపీ ప్రభుత్వ హయాంలో 108, 104 వాహనాల నిర్వహణ బాధ్యతల టెండర్లను అరబిందో సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థపై మెుదట్నుంచీ ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడం, అలాగే ఆ సంస్థకు అప్పటి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో విషయం బయటకు పొక్కలేదు. దీంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వకుండా వారిని వేధించారు. అలాగే 108 వాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి అక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చింది. దీంతో కాంట్రాక్టు గడువు ఉండగానే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంది.

Exit mobile version
Skip to toolbar