AP Deputy Speaker : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు. ‘ఏమంటివి.. ఏమంటివి?’ అంటూ దారవీరశూర కర్ణ సినిమాలోని ఎన్టీఆర్ డైలాగ్స్‌తో రఘురామ ఏకపాత్రాభినయం చేశారు. ఆయన డైలాగ్‌లకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. తమ తమ స్థానాల్లో నిల్చొని రఘురామకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు, పవన్, మంత్రి నారా లోకేశ్ చప్పట్లతో అభినందించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా యలమంచిలి ఎమ్మెల్యే సందరపు విజకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరావులు హాస్య నటనతో ఆకట్టుకున్నారు. ఇరువురు ఎమ్మెల్యేలు పాటలతో హాస్యం పండించారు. ఎమ్మెల్యేల నటనకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు కడుపుబ్బా నవ్వుకున్నారు. పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో మంత్రి కందుల దుర్గేష్ అదరగొట్టారు. వేషధారణ, అద్భుతమైన డైలాగ్‌లతో అందరినీ ఆకర్షించారు. దుర్గేష్ ప్రదర్శనకు సభ్యుల నుంచి ప్రశంసల వెల్లువెత్తాయి.