Theft in Kia Car Industry: ఏపీలో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా కార్ల కంపెనీ కియాకు దొంగలు ఎసరు పెట్టారు. ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఏకంగా 900 ఇంజిన్లు దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలోని శ్రీసత్య సాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో 900 ఇంజిన్లను అర్ధరాత్రి దొంగిలించారు. వాస్తవంగా ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. కానీ, విషయాన్ని దాచినట్లు తెలుస్తోంది. తాజాగా దొంగతనం ఘటనపై అసలు విషయాలు బయటకొచ్చాయి.
ఘటనపై పోలీస్ ప్రత్యేక బృందం ఏర్పాటు..
ఈ ఘటన జరిగిన వెంటనే కియా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. విషయం బయటకు రాకుండా దర్యాప్తు చేయాలని ఏపీ పోలీసులను కియా యాజమాన్యం కోరిందని చెబుతున్నారు. కానీ, పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలోనే మార్చి 19న దొంగతనం జరిగిన ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది.
తమిళనాడు నుంచి ఏపీకి..
తమిళనాడు నుంచి ఏపీలోని కియా పరిశ్రమకు ఇంజిన్లు నిత్యం తీసుకువస్తారని సమాచారం. గత నెలలో ఇంజిన్లు తమిళనాడు నుంచి ఏపీకి వచ్చాయి. ఈ క్రమంలోనే దారిలోనే మాయం చేశారా..? కంపెనీకి వచ్చిన తర్వాత దొంగిలించారా ? అనే కోణంలో పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.