Palle Panduga: పల్లెకు పట్టం… సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ

Deputy Chief Minister Pawan Kalyan launches Palle Panduga: పల్లెలు స్వయం పాలన, ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుడగు వేస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు.. గ్రామ స్వరాజ్య లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయ్‌. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో పల్లెకు పట్టం గట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ శాఖా మంత్రి పవన్‌ కల్యాణ్‌ దీనికి కర్త, కర్మ కావడం విశేషం.

చరిత్రలో ఎన్నడూ ఎరుగని నూతన అధ్యాయానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది ఆగస్టు 23న గ్రామ సభలు నిర్వహించగా… వాటిలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీర్మానాలు చేసిన పనులకు శంకుస్థాపన చేసేందుకు ‘పల్లెకు పండగొచ్చింది’ పేరిట అక్టోబర్ 14 నుంచి 20 వరకు పంంచాయతీ వారోత్సవాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా కృష్టా జిల్లా కంకిపాడులో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కొనిదల పవన్‌ కల్యాణ్‌ వారోత్సవాలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను పల్లెల్లో గ్రామ సభల ఆమోదం పొందిన 30వేల పనులకు రూ.4,500 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. గ్రామాలను రోడ్డు సౌకర్యంతో అనుసంధానించడం ద్వారా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేరవేశారు. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన పండుగని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోందని ఆయన పునరుద్దాటించడం గమనార్హం.

గతంలో ఇలా…
రాష్ట్రంలో గత 5 ఏళ్లల్లో జరిగిన అభివృద్ధి అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను తోలు బొమ్మలుగా మార్చారు. పంచాయతీల్లో కీలకమైన సర్పంచ్‌ లకు పవర్‌ లేకుండా చేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించ లేదు సరికదా.. కేంద్రప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులను కూడా దారి మళ్లించారు. దీంతో పల్లె ప్రగతి.. మంచం పట్టింది. రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, కొత్త రహదారులు నిర్మించక పోవడంతో గ్రామాలకు వెళ్లే దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. వృద్ధులు, చిన్నారులు, రోగులు, గర్భిణులు ఎన్ని అవస్థలు పడుతున్నామని చెప్పినా… పట్టించుకునే నాథుడే లేకపోయాడు.

50 రోజుల్లోనే ఆమోదం…
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే పంచాయతీలకు జీవం పోశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటి సరఫరాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌… పల్లె ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్థానిక సంస్థలకు బలం ఇచ్చేలా… ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించడంతో పాటు ప్రపంచ రికార్డు సైతం సొంతం చేసుకున్నారు. అనంతరం పనులకు ఆమోదం తెలపడంతో పాటు 50 రోజుల్లోనే పనుల ప్రారంభానికి శంకుస్థాపనలు చేసేందుకు పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్య లక్ష్యాలను చేరుకునేందుకు తానే ఓ సైన్యమై ముందడుగు వేశారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసేలా ప్రజా ప్రతినిధులు, ప్రజలు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. అలాగే… ప్రభుత్వ పనుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగేలా పనులకు సంబంధించి పూర్తి వివరాలను డిస్‌ ప్లే బోర్డులు ఏర్పాటు
చేయాలని అధికారులను ఆదేశించారు.

పనులు, ప్రాధాన్యాలు..
రాష్ట్రంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాధాన్య పనులను గుర్తించింది. ప్రజలకు అత్యంత అవసరమైన పనులకు ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఈ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. వాటిలో…
– 30 వేల పనులకు రూ.4,500 కోట్ల కేటాయింపు
– పంచాయతీరాజ్‌ పరిధిలో 3వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్ల నిర్మాణం
– 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి అడుగులు
– గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించేందుకు లక్ష్యం
– 65 వేల ఎకరాల్లో ఉద్యానవన మొక్కల పెంపునకు చర్యలు
– గ్రామాల్లో నీటి సంరక్షణకు 25వేల ఫార్మ్‌ పాండ్ల నిర్మాణం
– పాడి రైతులకు అండగా నిలిచేలా 22 వేల 500 గోకులాల ఏర్పాటు
– పాఠశాలలకు ప్రహరీలు, ప్రభుత్వ భవనాలకు మరమ్మతులు
– గ్రామాల్లో కమ్యూనిటీ, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు
– 30వేల ఎకరాల్లో నీటి సంరక్షణకు ట్రెంచ్‌ ల ఏర్పాటు
– ఐటీడీఏ పరిధిలో పూర్తిగా రోడ్డు లేని 87 గిరిజన గూడేలకు రూ.167 కోట్లతో పనులు
– గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో రోడ్డు పనులకు ప్రాధాన్యం.