Summer Makeup: ఎండలు మండిపోతున్నాయి. మరో పక్క పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా మేకప్ తప్పనిసరి అయిపోయింది. మరి ఈ వేడిలో మేకప్ వేసుకుంటే.. పది నిమిషాలకే చెమటలు పట్టి, మేకప్ కరిగిపోతుంది. మరి కాలానికి తగ్గట్టుగా మేకప్ వేసుకోక పోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎండకూ.. వేడికి కరిగిపోకుండా రోజంతా మేకప్ చెదిరి పోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ను పాటించాలి.
తక్కువ మేకప్ పైనే(Summer Makeup)
సమ్మర్ తక్కువ మేకప్ పైనే దృష్టి పెట్టాలి. ఎక్కువగా వాటర్ ఫ్రూఫ్ మేకప్ ను వాడటం మంచిది. దీని వల్ల మేకప్ కరిగి పోకుండా ఉంటుంది. మార్కెట్లో వాటర్ ఫ్రూఫ్ మస్కారాలు, ఐలైనర్స్, లిప్ కలర్స్ ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
ఈ కాలంలో మేకప్ వేసుకొనే ముందు ముఖాన్ని ఎక్కువ నీళ్లతో కడగాలి. దీని వల్ల ముఖంపై అదనంగా ఉన్న తడి తొలగిపోతుంది. ఆ తర్వాత రోజ్‌వాటర్‌తో ముఖాన్ని అద్దుకుంటే.. ముఖానికి మంచి గ్లో వస్తుంది.
కొన్ని ఐస్ ముక్కలను తీసుకొని వాటిని ఒక క్లాత్ లో ఉంచి ముఖాన్ని తుడవాలి. దీని వల్ల ముఖంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. అప్పుడు మేకప్ వేసుకోవటం ఈజీ అవుతుంది.
చర్మం కమిలిపోకుండా
మేకప్ వేసుకున్న తర్వాత ముఖాన్ని క్లాత్ తో తుడవకూడదు. దీని వల్ల మేకప్ చెదిరిపోవటమే కాకుండా మచ్చలు కూడా ఏర్పడతాయి. చెమట పట్టి ముఖంపై తడి ఏర్పడితే దానిని బ్లాటింగ్ పేపర్‌తో తుడిస్తే మంచిది. వీలైనంత వరకు తక్కువ మేకప్ వేసుకుంటే ఇలాంటి సమస్యలు రావు.
సన్‌స్క్రీన్ లోషన్ లక్షణాలున్న మాయిశ్చరైజర్స్‌ను, కన్సీలర్స్‌ను వాడటం మంచిది. దీని వల్ల ఎండవేడికి చర్మం కమిలిపోకుండా ఉంటుంది.
పౌడర్‌ను రాసిన తర్వాత తడిపిన స్పాంజ్‌తో తుడవాలి. దీని వల్ల పౌడర్ ఎక్కువ సేపు ఉంటుంది.
ఈ కాలంలో కళ్లకు కాటుక పెట్టేడప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కింది కనురెప్పకు కాటుక పెట్టిన తర్వాత ఐ లైనర్‌తో ఒక లైన్ గీయాలి. దీనివల్ల చెమట పట్టినా కాటుక స్ప్రెడ్ అవ్వదు.
మాయిశ్చరైజర్
పగటిపూట ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మాత్రమే ఉపయోగించడం వల్ల ముఖం జిడ్డుగా మారకుండా ఉంటుంది.
మేక్‌పతో పని లేకుండా వేసవి కాలమంతా 30 కంటే ఎక్కువ ఎస్‌పిఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ లు వాడుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ ఆ తర్వాత ఫౌండేషన్ వేసుకోవడం ఉత్తమం.
వేసుకున్న మేకప్ లుక్ తగ్గకుండా ఉండాలంటే ప్రైమర్ కూడా తప్పనిసరిగా వాడాలి. ముడతలను కనపడనివ్వకుండా చేసే ప్రైమర్‌తో యంగ్ లుక్ వస్తుంది.
కళ్లకు బ్రాంజర్(Summer Makeup)
ఈ కాలంలో కళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే బ్రాంజర్ వాడుకోవాలి. తాజాగా, సహజసిద్ధ సౌందర్యంతో మెరిసిపోవాలంటే ఎండ సోకే వీలుండే నుదురు, చీక్ బోన్స్, , ముక్కు మీద బ్రాంజర్ అప్లై చేయాలి. ఎండాకాలంలో పౌడర్ టైప్ బ్రాంజర్లనే ఎంచుకోవాలి.
అవసరానికి మించిన మెరుపులు ఈ కాలంలో ఎబ్బెట్టుగా ఉంటాయి. కాబట్టి వేసవిలో షిమ్మర్‌ను వాడకపోవడమే మంచిది. అదే విధంగా ఈ కాలంలో పౌడర్ బ్లష్‌లకు బదులుగా జెల్ బ్లష్ వాడుకోవాలి.
మరోవైపు డార్క్ కలర్స్ లిప్‌స్టిక్స్ బదులుగా లేత గులాబీ, లేత నారింజ రంగులను ఎంచుకుంటే వేసవిలో హాయి కలిగించే లుక్ వస్తుంది.