Health Tips : రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యే సరికి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కడబడుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసివి సెలవుల కారణంగా చిన్న పిల్లలను వెకేషన్ కు తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఇదే సమయంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ కూడా చూసుకోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేసవి కాలంలో పిక్నిక్ కు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో కామినేని హాస్పిటల్స్ డాక్టర్ డా. సౌజన్య యలవర్తి వివరించారు.
మీ పిల్లలను ఎండ నుంచి రక్షించండిలా..
సాధారణంగా వేసవిలో వడదెబ్బలు ఎక్కువగా తగులుతుంటాయి. దీని బారిన పడిన వారు చాలా బలహీనంగా మారుతారు. వేడిమి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మీ పిల్లలను బయటకు పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి బరిన పడకుండా రక్షిత దుస్తులను , టోపీలు, చలవ కళ్ల జోళ్లను ధరించడం మంచిది. వేసవి కాలంలో సూర్య తాపానికి గురి కాకుండా మీ పిల్లలు ఎక్కువ నీటిని తాగేలా చూసుకోవాలి.
పిల్లల శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోండిలా..
వేసవి కాలంలో శరీరం డీహైడ్రేట్ కావడం అనేది చాలా సాధారణం. అయితే దీనికి పిల్లలు చాలా దూరంగా ఉండాలి. వేసవి కాలం వచ్చింది అంటే పిల్లలు మార్కెట్లో దొరికే కార్బోనేటేట్ పానియాలపై ఎక్కువ మక్కువ చూపుతుంటారు. వాటిని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. శీతల పానీయాలకు బదులుగా నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా ఉత్తమమైన పని చెప్పవచ్చు. అంతేకాకుండా నిర్ణీత వ్యవధిలో నీటిని పిల్లలు తీసుకునేలా అలవాటు చేయాలి. బయటకు వెళ్లేటప్పుడు మీతో వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.
స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్త (Health Tips)..
వేసవి కాలంలో ఈత ఆడడం పిల్లలకు మంచి సరదా. కానీ కొన్నిసార్లు ఇది ప్రమాదకరం కూడా కావచ్చు. పిల్లలు ఈతకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు కూడా దగ్గరుండాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈత నేర్చుకోవడం మంచిది. అలాగే ఈతాడే సమయంలో అందుకు తగిన దుస్తులను వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పరిగెత్తకుండా చూసుకోవాలి.
తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి..
వేసవి కాలంలో పిల్లలు తీసుకునే ఆహారం పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎండా కాలంలో వేడి, తేమ కారణంగా కొన్ని వ్యాధులు ఆహారం ద్వారా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వీధుల్లో దొరికే చిరుతిండ్లు తినడం తగ్గించాలి. వీటి ద్వారా జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తి విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అందుకే మీ పిల్లల ఆహారం పరిశుభ్రమైన పద్ధతిలో తయారు చేసిందో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి. పండ్లు, కూరగాయలను తినడానికి ముందు వాటిని బాగా కడగాలి. పండ్ల విషయానికి వస్తే నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.
దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
వేసవిలో దోమల నుంచి దూరంగా ఉండాలి. అంతేగాకుండా పేలు, ఇతర ప్రాణహాని కలిగించే కీటకాలు మరింత చురుకుగా తిరుగుతుంటాయి. వీటి ద్వారా పిల్లలు డెంగ్యూ, మలేరియా వ్యాధి వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటి నుంచి దూరంగా ఉండేలా జెట్ కాయిల్స్, రక్షిత దుస్తులను ధరించాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా వేసవి సెలవుల్లో పిల్లలను సురక్షితంగా ఉంచుకోవచ్చని సూచించారు.
“వేసవి సెలవుల్లో పిల్లలను ఎండ నుంచి సురక్షితంగా ఉంచడానికి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం డీ-హైడ్రెట్ కాకుండా శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎండ నుంచి రక్షణ పొందడానికి తెల్ల రంగు గుడ్డలు వేసుకోవాలి. ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో దోమలు, కీటకాలు రాకుండా క్రిమిసంహారక మందులను చల్లుకోవాలి. వేసవి కాలంలో వీలైనంత వరకు బయట ఆహారం తగ్గించేడం మంచిది. ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలకు వేసవి సెలవులను హాయిగా ఆనందించవచ్చని చెబుతున్నారు.