Year 2024 incidents in telugu states: అనంత కాల ప్రవాహంలో ఒక ఏడాది కాలం.. అత్యంత చిన్న అవధే కావచ్చు. అలాగే, ఒక మనిషి జీవితకాలంలోనూ ఇది పెద్దగా లెక్కపెట్టాల్సిన సమయమూ కాకపోవచ్చు. అయితే, సంఘజీవిగా ఉండే మనిషికి ప్రతి ఏడాదీ కొన్ని మంచి, చెడు అనుభవాలు మాత్రం ఖచ్చితంగా ఉండి తీరతాయి. మరికొన్ని గంటల్లో పాత సంవత్సరం కాలగర్భంలో శాశ్వతంగా కరిగిపోయే వేళలో.. ఆ ఏడాది కాలంలో తాము సాధించిన విజయాలు, అనుభూతి చెందిన మధుర జ్ఞాపకాలు, ఇబ్బంది పెట్టిన చేదు అనుభవాలను మానవ సమాజం ఒకసారి స్మరించుకోవటమూ సహజమే. సాధారణంగా పాత సంవత్సరంలోని విజయాలు, మధుర జ్ఞాపకాలు మనిషిని ఉత్సాహంగా కొత్త ఏడాదిని స్వాగతించేలా చేస్తే, ఈ ఏడాది కాలంలో ఎదురైన చేదు జ్ఞాపకాలు మరుపున పడేలా.. కొత్త ఏడాది ఏదో ఒక తెలీని వాగ్ధానం చేస్తోన్న భావన దానిని స్వాగతించేలా చేస్తుంది. బహుశ: కాలమహిహ ఇలాగే ఉంటుందేమో.
ఖాళీ ఖజానాను వారసత్వంగా అందుకుని, తీవ్ర రాజకీయ అనిశ్చితి పరిస్థితులలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరచి, తన లౌక్యం, చాణిక్యంతో పూర్తి కాలం నడపటమే గాక కుర్చీ పోతుందనే భయం లేకుండా ధైర్యంగా సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి బాట పరుగులెత్తించిన మన తెలుగు ఠీవి.. అయిన పీవీ నరసింహరావుకు ఈ ఏడాది కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. మరణానంతరం ఆయనకు ఈ అవార్డు ప్రకటించటంతో ఆయన కుమారుడు ప్రభాకరరావు.. మార్చి 30న భారత రాష్ట్రపతి చేతుల మీదగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇక.. తెలుగు సినీ రంగంలో స్యయంకృషితో అగ్రస్థానానికి ఎదిగి తన అభిమానులకు వినోదాన్ని అందించటమే గాక వారిని సామాజిక సేవలోనూ నిమగ్నం చేసిన మెగాస్టార్ చిరంజీవికి 2024లో కేంద్రం పద్మవిభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది. భారత ప్రభుత్వం ఇచ్చే ఈ రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది మే9న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా చిరంజీవి అందుకున్నారు. ఈ ఏడాది ఆయనకు మరో గుర్తింపు కూడా దక్కింది. మొత్తం 156 చిత్రాలలోని 537 పాటలలో 24 వేల రకాల స్టెప్పులేసి, ప్రపంచంలోని ఏ సినీనటుడికీ సాధ్యంకాని ఫీటు సాధించినందుకు గానూ ఆయన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిస్తూ.. ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కూటమిగా ఏర్పడిన రాజకీయపార్టీలు చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నాయి. అందులో జనసేన పాత్ర ప్రత్యేకమైనదే గాక బరువైనది కూడా. గత ఐదేళ్లుగా ఫక్తు నియంత ధోరణితో పాలించిన వైసీసీని ఢీకొట్ట గల నైతిక శక్తిని విపక్ష పార్టీలకు అందించి, వాటిని ఒక వేదిక మీదికి తీసుకురావటంలో జనసేన అధినేత పవన్ చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయాలు 2024 సంవత్సరాన్ని ఎప్పటికీ మరువలేని ఏడాదిగా మార్చేశాయి. 2014లో జనసేన పార్టీ పెట్టి, అనేక ఆటుపోట్లు, అవమానాలను భరించి, ఏ పదవికీ ఆశపడకుండా ప్రజలనే నమ్మిన ఈయనకు ఈ ఏడాదిలో జనం ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. నిరాశకు లోనైన టీడీపీని, భవిష్యత్ కార్యాచరణ లేని బీజేపీని ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన పవన్.. కూటమి పేరిట జనంలోకి వెళ్లి.. ఎన్నికలకు రెండు నెలల ముందే.. గొప్ప రాజకీయ, సామాజిక మార్పును తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం, ప్రత్యర్థిని ఢీకొట్టటంలో ఆయన చూపిన తెగువ, రాజకీయాల్లో ఆయన అవలంబిస్తున్న విధానాలు, అందరితో మమేమకమై గత పాలకులు గీసిన కుల, మత, వర్గ, ప్రాంత పరమైన అడ్డుగోడలను తుత్తునియలు చేసిన తీరుకు తెలుగునేల పులకించిపోయింది. అందుకే.. ఆయన నిలబెట్టిన ప్రతి మనిషినీ గుండెలకు హత్తుకుని వారిని సగర్వంలో శాసన సభలో కూర్చొనేలా చేసింది. పవన్ వల్లనే నేడే ఏపీలో రాజకీయ మార్పు సాధ్యమైందనే విషయంలో నేడు దేశంలో ఎవరూ విభేదించలేని వాతావరణం నెలకొన్న వేళ.. నూతన ఏడాదిలో ప్రజలు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకునేందుకు ఆయన ఒక స్పష్టమైన కార్యాచరణతో పర్యటనల పేరుతో ముందుకు సాగనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి పల్నాడు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. ఆయన రాసిన అభ్యుదయ వ్యాస సంపుటి ‘దీపిక’కు ఈ అవార్డు దక్కింది. నూజండ్ల మండలం చెరువుకొమ్మపాలెం గ్రామంలో పుట్టిన ఆయన ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నారు. అలాగే, పారాలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తి 400 మీటర్ల టీ20 పరుగుపందెంలో కాంస్యం అందుకుంది. జన్మత: వచ్చిన శారీరక, మానసిక సమస్యలతో చాలాకాలం ఇంటికే పరిమితమై దీప్తి.. అనేక సమస్యలను అధిగమించి అంతర్జాతీయ ఖ్యాతిని గడించటంతో తెలుగునేల పులకరించిపోయింది. అలాగే, తమిళనాడులో ఉంటున్నప్పటికీ, తెలుగు మూలాలున్న గుకేశ్ దొమ్మరాజు 18వ ఏటనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలవటం కూడా తెలుగువారిని గర్వపడేలా చేసింది.
ఇక.. ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో ప్రకృతి విపత్తులు ముందువరుసలో ఉన్నాయి. ఆగస్టు 31, 2024న రాత్రి నుంచి దాదాపు రెండు వారాలపాటు కురిసిన వర్షాలతో ఖమ్మం, విజయవాడ నగరాలను వరదనీరు ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వరదనీరు ఈ రెండు నగరాలపై పడడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు నదులు, ఏరులు, చెరువులు, కాలువలకు ఒక్కసారిగా పెద్దఎత్తున నీరు చేరడంతో కట్టలు తెగి వరదనీరు ఇళ్లను ముంచెత్తింది.ఈ నగరాల్లో వరదలకు బుడమేరు, పాలేరు, మున్నేరు నదులు రికార్డుస్థాయిలో పొంగిపొర్లడమే కారణం. అయితే, విజయవాడలో కూటమి ప్రభుత్వం, ఇటు ఖమ్మంలో రాష్ట్ర ప్రభుత్వం తమవంతుగా జనానికి అండగా నిలిచి, ఈ పెద్ద విపత్తు నుంచి బయటపడేయగలిగాయి. అలాగే, ఈ ఏడాది అత్యంత ఆందోళనకు గురిచేసిన మరో అంశంగా సైబర్ నేరాలు నిలిచాయి. నూటికి 90 శాతం మంది మొబైల్ వాడుతున్న ఈ రోజులలో కేటుగాళ్లు.. ఫోన్‌కు లింక్ పంపటం, ఓటీపీలు తెలుసుకుని బ్యాంకు ఖాతాల్లోని కోట్లాది రూపాయలు సామాన్యుల కష్టాన్ని దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సైబర్ నేరాలు 34 శాతం పెరిగాయి. 2024 సంవత్సరంలో 916 మంది నుంచి 1229 కోట్ల రూపాయలను కేటుగాళ్లు కాజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరు నెలల్లోనే రోజుకు 133 చొప్పున ఇలాంటి ఫిర్యాదులు ఏపీ సర్కారుకు అందాయి. ఇక.. ఇక.. తెలంగాణలో లక్షా 14వేల 174 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మొత్తం.. రూ. 1867 కోట్లను కేటుగాళ్లు దోచేశారు. నివారించదగిన ఈ మోసాల అడ్డుకట్టకు కొత్త ఏడాదిలోనైనా గట్టి ప్రయత్నం జరగాల్సి ఉంది. మన సనాతన భారతీయ చింతనలో.. కాల విభజన, కాల గణన అనేవి మనిషి జయాపజయాలను బేరీజు వేసుకుని, పునరుత్తేజం, గుణపాఠమూ నేర్చుకోవటానికే ఉద్దేశించబడ్డాయి. గడచిన కాలాన్ని విశ్లేషించుకొని, వర్తమానంలో జీవిస్తూ, భవిష్యత్తును అంచనా వేసుకోవడమే మానవ ధర్మమని అవి మనకు బోధిస్తున్నాయి. ఈ సంవత్సరపు పూర్వ సంధ్యలో మనమూ ఈ దిశగా ఆలోచిస్తూ.. కొత్త సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుదాం.