Site icon Prime9

Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఘనంగా వీడ్కోలు.. భావోద్వేగ ప్రసంగం చేసిన వెంకయ్యనాయుడు

New Delhi: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు. ‘‘సభ్యులు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలని, సభా కార్యకలాపాల్ని ప్రజలందరూ గమనిస్తుంటారని చెప్పారు. సభ గౌరవం కాపాడటంలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వస్తుందని, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌ అమలులో నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఏ పార్టీకి చెందిన సభ్యులపైనా తప్పుడు అభిప్రాయాలు ఉండవు. నాయకులకు శత్రువులు ఎవరూ ఉండరు.. ప్రత్యర్థులే ఉంటారని వెంకయ్య అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక వేళ భావోద్వేగానికి గురయ్యానని, అభ్యర్థిగా తనను ఎన్నుకున్నట్టు పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధాని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. పార్టీకి రాజీనామా చేసినప్పుడు బాధ కలిగింది. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ఆ పదవి నేను అడగలేదు. పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరసావహించి పార్టీకి రాజీనామా చేశాను. పార్టీని వదిలి వెళ్తున్నాననే బాధ వెంటాడిందని ఆ నాటి జ్ఞాపకాలను వెంకయ్య నెమరువేసుకున్నారు.

సభను సజావుగా నడపడంలో తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చా. సభలో అన్ని పార్టీల సభ్యులకూ సమాన అవకాశాలు ఇచ్చాను. సభ్యులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి.. సభ విలువను పరిరక్షించాలి. పెద్దలు అందించిన ప్రజాస్వామ్య విలువల్నికాపాడాలన్నారు ఉప రాష్ర్టపతి. పార్లమెంటు కార్యకలాపాలు ఎప్పుడూ సజావుగా సాగాలి. సభలో చర్చలు పక్కదోవపట్టకుండా చూడాలి. సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సి ఉందన్నారు. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. మాతృభాష తర్వాతే మరే భాషనైనా గౌరవించండి. ఎగువసభ సభ్యులు సభా గౌరవాన్ని కాపాడాలి. మన ప్రత్యర్థుల కంటే మెరుగ్గా పనిచేసి ముందుకెళ్లాలి తప్ప వారిని పడదోయాలనుకోకూడదని సూచించారు. పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగాలని కోరుకుంటున్నా. మీ ప్రేమ, ఆప్యాయతలకు నేను కృతజ్ఞుడిని’’ అంటూ వెంకయ్యనాయుడు ఉద్వేగానికి లోనయ్యారు.

ఈ నెల 10వ తేదీతో ఉపరాష్ర్టతిగా పదవీ కాలంపూర్తి చేసుకుంటున్న వెంకయ్య నాయుడికి పెద్దల సభ వీడ్కోలు పలికింది. రాజ్యసభ చైర్మన్‌గా అయిదేళ్ల పాటు ఆయన నిర్వహించిన భూమికపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడారు. రాజ్యసభ సభ్యలు తరపున పార్లమెంటు ఆవరణలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. వెంకయ్యనాయుడికి ప్రధాని జ్ఞాపికను బహుకరించారు. వెంకయ్య హయాంలో జరిగిన వివిధ కార్యక్రమాల సమాహారంతో వెలువరించిన పుస్తకాన్ని ప్రధాని విడుదల చేశారు.

Exit mobile version