New Delhi: నేడు భారత 16 వ ఉపరాష్ట్ర పతి ఎన్నికల కోసం పార్లమెంట్ భవనంలో ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మాజీ పశ్చిమ భెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ బరిలో నిలవగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మార్గరేట్ ఆల్వా బరిలో ఉన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ హాల్ లోనే కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి ముందుకు రాక పోవడంతో ప్రతిపక్షాల బలం తగ్గే అవకాశం ఉంది.
ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ధన్ ఖడ్ గెలుపు నల్లేరు మీద నడకగానే కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. కేవలం ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉండటంతో ఎన్డీఏ అభ్యర్థి విజయం లాంచనంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో మొత్తం 780 మంది సభ్యులు ఉండగా, గెలుపొందే అభ్యర్థికి 373 ఓట్లు కావాలి. ఒక్క బీజేపీకే లోక్ సభలో 303, రాజ్యసభలో 91 మంది ఎంపీల బలంతో కలిపి 394 ఓట్లు ఉన్నాయి. దానికి తోడు మిత్ర పక్షాలు సపోర్ట్ చేయడంతో.. దన్కడ్ కు మెజారిటీ పెరిగే అవకాశం ఉంది.
లోక్ సభలో 543 మంది, రాజ్య సభలో 245 మంది ఓటు వేసే అవకాశం ఉండగా, ప్రస్తుతం రాజ్యసభలో జమ్ము కాశ్మీర్ నుంచి నలుగురు, త్రిపుర నుంచి ఒకరు, నామినేటెడ్ సభ్యుల నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా తృణముల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో 36 మంది ఎంపీలు బలం కలుపుకుని 44 ఓట్లు తగ్గడంతో 744 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉండటంతో కొత్తగా నామినేట్ అయిన 12 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటును
వినియోగించుకుంటారు.
పార్లమెంట్ లో ఎన్డీయే కూటమికి మిత్ర పక్షాలను కలుపుకుని 544 మంది బలం ఉంది. అంటే ఎలక్టోరల్ కాలేజీలో 73 శాతం ఓట్లు ధన్‌ఖడ్‌కు దక్కే సూచనలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో అధికారకూటమి అభ్యర్థి వెంకయ్యనాయుడికి 67.89% ఓట్లు దక్కగా, ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 32.11% వచ్చాయి. ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ప్రధానమైన టీఎంసీ దూరం కావడంవల్ల ఉమ్మడి అభ్యర్థికి ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీ కాలం 10వ తేదీతో ముగియనుండగా కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవురోజైనప్పటికీ యథావిధిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. 12వ తేదీవరకు పార్లమెంటు సమావేశం ఉండటంతో చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.