Hyderabad: ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. తొలిసారిగా సిటీ కమిషనరేట్‌ పరిధిలో నియామకాలు

Transgenders as traffic volunteers in Hyderabad: ట్రాన్స్‌జెండర్లు ఇక నుంచి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర అడుక్కోరు.. కానీ సిగ్నల్స్‌ దగ్గర అతిత్వరలో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తూ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను కూడా వాలంటీర్లుగా నియమించనున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజులపాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాంతోపాటు ప్రతి నెల నిర్దేశిత స్టైపెండ్ ఇవ్వనున్నారు. తెలంగాణలో 3 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లు ఉన్నారని, నగరంలో వెయ్యి మంది ఉన్నట్లు అంచనా. ఆసక్తిగల వారిని గుర్తించి నియమించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తొలిసారిగా సిటీ కమిషనరేట్‌ పరిధిలో నియామకాలు..
తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌ పరిధిలో బుధవారం నియామకాలు చేపట్టారు. గోషామహల్‌ స్టేడియంలో ట్రాన్స్‌జెండర్లకు ఈవెంట్స్‌ నిర్వహించారు. రన్నింగ్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేశారు. మొత్తం 44 మందిని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన వారిని శిక్షణ ఇచ్చి నియామకాలు చేపట్టనున్నారు. ఈవెంట్స్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పరిశీలించారు. ఈవెంట్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీసు కొలువు కోసం వచ్చిన ట్రాన్స్ జెండర్లతో కాసేపు సరదాగా సీపీ ముచ్చటించారు.