Telangana Legislative Council Session 2024: తెలంగాణ శాసనమండలిలో శనివారం మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మండలి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని 80 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణకు వీలు పడేలా పంచాయతీరాజ్ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించేందుకు ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు కూడా ఆమోదం లభించింది.
కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఇవే
ఈ బిల్లులు.. చట్టాలు కాగానే మహబూబ్‌నగర్, మంచిర్యాల మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ కానున్నాయి. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలో కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, జనగాం జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్, నారాయణపేట జిల్లాలో మద్దూర్, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మెయినాబాద్‌ను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేశారు. పరిగి మున్సిపాలిటీలో మరో ఆరు గ్రామాలు, నర్సంపేటలో ఏడు గ్రామాలు, నార్సింగిలో ఒకటి, శంషాబాద్‌లో ఒక గ్రామం, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మరో ఆరు గ్రామాల విలీనం చేశారు.