Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ భారీ ఆశలు.. రూ. 1.63 లక్షల కోట్లు ఇవ్వాలని వినతి

Telangana high expectations from Union Budget 2025-26: వచ్చే ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిరుటి వార్షిక పద్దులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం ఈసారైనా న్యాయమైనా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు సేవల విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు కావాలంటూ ఇప్పటికే సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార, ఆయా శాఖల మంత్రులు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

ట్రిఫుల్‌ఆర్‌కు ప్రాధాన్యం
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తన ప్రాధాన్యతల్లో భాగంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి పూనుకొంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధి బయట ఉన్న జిల్లాలలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ ఈ రోడ్ వేయగలిగితే, ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని సర్కారు భావిస్తోంది. ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమల వృద్ధి, లాజిస్టికల్‌ హబ్స్‌ ఏర్పడితే ఎక్కడివారికి అక్కడే ఉఫాధి దొరుకుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కనుక.. ప్రధమ ప్రాధాన్య అంశంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సర్కారు గట్టి పట్టుదలగా ఉంది. ఇప్పటికే భూసేకరణను మొదలు పెట్టిన సర్కారు.. కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34,367 కోట్ల సాయాన్ని తెలంగాణ సర్కారు కోరుతోంది.

మెట్రో రెండో దశ..
హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రెండో దశలోని 76.4 కిలోమీటర్ల పరిధిలో పనులకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. కేంద్రంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా దీనిని పట్టాలెక్కించాలని, ఈ క్రమంలో కేంద్రం తమ వాటాగా రూ.24,269 కోట్లు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరుతోంది. అలాగే, అనంతగిరి నుంచి హైదరాబాద్ మీదగా, నల్లగొండ జిల్లా వరకు పారుతున్న మూసీనదిని ప్రక్షాళన చేసి, ఆ నదీ గర్భంలో నివసించేవారికి మెరుగైన జీవితాన్ని అందించాలనేది సర్కారు సంకల్పంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మూసీ సమీపంలోని 220 ఎకరాల రక్షణశాఖకు చెందిన భూమిని ఇవ్వాలని రాష్ట్ర సర్కారు కోరటంతో బాటు ఈ ప్రాజెక్టుకు రూ.14,100 కోట్ల నిధులు అవసరమవుతాయని కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆ బకాయిల సంగతేంటి? 
కేంద్రం రాష్ట్రానికి రావాల్సిన రూ.1,800 కోట్ల గ్రాంట్లను విడుదల చేయటంతో బాటు 2014 నాటి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం మీద పడిన రూ.2,547.07 కోట్ల అప్పులు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాగా, 2014-15 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్ల బకాయిల మంజూరుతో పాటు కాజీపేటలో సమగ్ర కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, వరంగల్‌ జిల్లా మామునూరు, ఖమ్మం జిల్లా పాల్వంచ, పెద్దపల్లి జిల్లా అంతర్గావ్‌, ఆదిలాబాద్‌‌లలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ప్రాంతాలలో నేటికీ రైలు రవాణా లేని ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచాలని కూడా ప్రతిపాదించారు. మొత్తంగా.. ఈ అన్ని పనులకు గానూ, రూ.1.63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.