Telangana Government good news to RTC Employees for DA: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేసినట్లు చెప్పారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత దిశగా రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తోంది. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేసేందుకు రేపటి నుంచి ఇందిరా మహిళా శక్తి బస్సును ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగానే తొలి విడతలో మండల మహిళా సమైక్య సంఘాల నుంచి 150 బస్సులను ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు. అనంతరం రెండో విడతలో మరో 450 బస్సులను అందించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీతో ఇప్పటికే మహిళా సమైక్య సంఘాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.