Telangana Government Big Alert to HMPV Virus Spread in China: చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ 19 మాదిరిగానే హ్యుమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన చాలామంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఫ్లూ లక్షణాలు ఉంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కాగా, ఎవరికైనా జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే జనసమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇదిలా ఉండగా, కోవిడ్ మాదిరిగానే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊపిరి పీల్చుకోకపోవడం, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. వీరిపై హెచ్ఎంపీవీ వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతుండగా.. అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.