Telangana Government another four schemes to Be Launched on This Month 26th: తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ప్రజల నుంచి ఆందోళనలతో అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల ముసాయిదాలో పేర్లు లేకపోయినా మళ్లీ దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈనెల 24 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కొత్తకప్పెటలో జరుగుతున్న గ్రామసభకు మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. పార్టీలకతీతంగా పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. అలాగే లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. దశలవారీగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి దామోదర నర్సింహ చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా రూ.12 వేలు ఇవ్వనుందన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోనివారికి మళ్లీ అవకాశం కల్పించిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర నర్సింహ అన్నారు.
కాగా, తెలంగాణలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. కాగా, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మరో 4 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనుంది.