Site icon Prime9

Telangana Assembly: మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలి.. అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly Session CM Revanth Reddy said bharat ratna should be given to Manmohan Singh: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ మేరకు తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశానికి మన్మోహన్ విశిష్టమైన సేవలు అందించారని పేర్కొన్నారు.

నిర్మాతక సంస్కరణల అమలులో మన్మోహన్‌ది కీలక పాత్ర అన్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టాలు మన్మోహన్ ఘనతేనని వెల్లడించారు. ఈ మేరకు మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. సరళీకృత విధానాలతో ప్రపంచంతో భారత్ పోటీ పడేలా చేశారన్నారు. నీతి, నిజాయితీలో మన్మోహన్‌తో పడేవారు లేరని, అలాంటి గొప్ప తత్వవేత్తను దేశం కోల్పోయిందని గుర్తు చేశారు.

మన్మోహన్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్తను కోల్పోవడం తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. పదేళ్లు అద్భుతమైన పరిపాలన అందించారని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పనిపైనే ఆయన ధ్యాస పెట్టారని చెప్పుకొచ్చారు. 2013లో భూసేకరణ చట్టంతో గ్రామాల్లో నిరుపేదలకు కూడా సాయం అందిందని గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో భూమిలేని వారికి కూడా నష్టపరిహారం అందించేలా చట్టం చేశారని వివరించారు.

మన్మోహన్ సింగ్ మరణం తీరని అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీలో ప్రపంచాన్ని శాసిస్తున్నామంటే మన్మోహన్ సరళీకృత విధానమే కారణమన్నారు. తెలంగాణకు మన్మోహన్ సింగ్ ఆత్మబంధువు అని, తెలంగాణతో ఆయన బంధం విడదీయలేనిదని వెల్లడించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ శాశ్వతమేనని చెప్పారు. అలాంటి గొప్ప తత్వవేత్త, మానవతావాదిని కోల్పోవడం దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాది మన్మోహన్ సింగ్ అని రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించారు. పదవులకే మన్మోహన్ గౌరవం తీసుకొచ్చారని కొనియాడారు. అందుకే మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పారు. అంతేకాకుండా మన్మోహన్ సింగ్.. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుడిగా, ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. అలాగే ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి సేవలందించారన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోశారని సీఎం చెప్పారు.

Exit mobile version