Mandous Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి మాండౌస్‌గా పేరు పెట్టారు. ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాను నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్ స్రైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపారు. తుఫాను రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావారణ కేంద్రం తెలిపింది.దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, శ్రీ పొట్టిశ్రారాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తుఫాను ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.