Site icon Prime9

Telangana: సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం.. ఈ నెల చివరి వరకు పూర్తి చేసేలా చర్యలు

Samagra Kutumba Survey In Telangana: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరించారు. ఈ సర్వేలో దాదాపు 85వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా.. వీరు 10శాతం కుటుంబాలను సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఈనెల చివరి వరకు పూర్తి చేసేలా ప్రభుత్వం భావిస్తోంది.

75 రకాల ప్రశ్నలు..
సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 75 రకాల ప్రశ్నలతో గణకులు వివరాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 9లోగా బీసీ కుల గణన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 64 నుంచి 75 ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేశారు. అయితే కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేసి సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేస్తున్నారు. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచనున్నారు. అయితే ఈ సర్వేలో భాగంగా కుటుంబ ఫోటోలు అవసరం లేదని ప్రకటించారు. దీంతోపాటు ఎలాంటి పత్రాలు కూడా తీసుకోకుండా కేవలం వివరాలు చెబితే సరిపోతుందన్నారు. ఒకవేళ ఎవరైనా విదేశాలకు లేదా రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు.

సర్వే సహకరించాలి.. మంత్రి పొన్నం
రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో సర్వేను మంత్రి ప్రారంభించారు. ప్రజల సహకారంతోనే ఈ సర్వే విజయవంతంగా అవుతుందన్నారు. అందరికీ న్యాయం చేయడం కోసమే సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని సూచించారు.

అందుబాటులో ఉండాలి.. డిప్యూటీ సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఇందులో భాగంగా ఆధార్‌, ధరణి, రేషన్‌కార్డు వివరాల సేకరణకు సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజల పరిస్థితిని అంచనా వేయడానికి రాజకీయ, ఆదాయ డేటాను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల వివరాలకు గోప్యత ఉంటుందని భట్టి చెప్పారు. ఇదొక విప్లవాత్మక కార్యక్రమమని అభివర్ణించారు.

Exit mobile version