Site icon Prime9

Veekshanam Review: “వీక్షణం” సినిమా రివ్యూ

Veekshanam Review

Veekshanam Review

Veekshanam Review: రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి డైరెక్ట్ చేసిన “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. టీజర్ సహా ట్రైలర్ తోనే సినిమా మీద ఆసక్తి పెంచిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూ లో చూద్దాం.

హైదరాబాదులో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ తో తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ఉంటుంది. తన స్నేహితుడితో కలిసి అలా చూస్తున్న సమయంలోనే అతనికి నేహ(కశ్వి ) మీద ప్రేమ పుడుతుంది. ఆమెను ప్రేమలో పడేసేందుకు తన స్నేహితుడి సహాయంతో అనేక ప్రయత్నాలు చేయగా చివరికి ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె ప్రేమలో పడుతుంది.

ఆమెతో గొడవ అయిన సమయంలో మరో ఇంటిని అలాగే పరిశీలిస్తుండగా ఒక అమ్మాయి రోజుకు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. ముందు పెద్దగా సీరియస్గా తీసుకోడు కానీ ఆ అమ్మాయి ఏదో పెద్ద క్రైమ్ చేస్తుందని భావించి ఆమె మీద ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె హత్యలు చేస్తుందని తెలిసి ఆమెను ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తుంది.

అయితే చనిపోయి ఎనిమిది నెలలు అయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? ఆర్విన్ తన స్నేహితుడు ఛీ ఛీ, బావమరిది(షైనింగ్ ఫణి)తో కలిసి చూసింది నిజమేనా? అసలు ఆ హత్యలు చేసేది ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో పాత్రలో రామ్ కార్తీక్ ఒదిగిపోయాడు. పక్క వాళ్ళ విషయాల మీద ఆసక్తి కనబరిచే ఒక సగటు కుర్రాడిగా ఆ పాత్రలో సరిగ్గా ఇమిడిపోయాడు. ఇక హీరోయిన్గా నటించిన కశ్వి ఒకపక్క గ్లామర్ వలకబోస్తూనే మరొకపక్క తనదైన అభినయంతో ఆకట్టుకుంది. బాలనటిగా తన అనుభవాన్ని ఈ సినిమాలో కూడా ఆమె చూపించింది.

అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కికి మంచి పాత్ర దొరికినట్లు అయింది. చనిపోయిన అమ్మాయి పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. షైనింగ్ ఫణి కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేసి చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వేరే లెవెల్ కి తీసుకు వెళ్లడంలో సంగీత దర్శకుడు సమర్ద్ గొల్లపూడి తన సమర్థతను చాటుకున్నాడు. నిజానికి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అద్భుతంగా అందించి సినిమాని మరింత ఎలివేట్ చేసేలా చేశాడు సమర్ద్ గొల్లపూడి. ఇక ఆయన అందించిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నెన్నో సాంగ్ తో పాటు వీక్షణ సాంగ్ చాలా క్యాచీగా ఉన్నాయి. రెండవ సినిమాకే సమర్ద్ గొల్లపూడి మ్యూజిక్ లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే సినిమాకి హీరో రామ్ కార్తిక్ అయితే టెక్నికల్ పరంగా హీరో సమర్ద్ గొల్లపూడి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ మొత్తాన్ని క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూపిస్తున్న సమయంలో కెమెరామెన్ పనితనం కనబడింది. సినిమాలోని ఫైట్స్ కూడా భిన్నంగా అనిపించాయి. ఫైట్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏమిటంటే మన పని మనం చూసుకోవడం అని విక్టరీ వెంకటేష్ చెబితే ఆ మాటను పట్టుకుని ఈ కథ రాసుకున్నాడు డైరెక్టర్ మనోజ్. సినిమా మొదలైనప్పటి నుంచి ఆ విషయం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్ తెరకెక్కించాడు. పక్కవాడి లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసే హీరో ఆ ప్రయత్నంలో భాగంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

ఆ ఇబ్బందులు ఏమిటి? ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వాటిని ఎలా అధిగమించాడు? అనే విషయాన్ని దర్శకుడు చాలా చక్కగా ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తెరకెక్కించాడు. నిజానికి ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రేక్షకులు ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ తో ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరికీ మధ్య గొడవలు ఏర్పడటం, హీరో మరో అమ్మాయిని చూడటం ఆ అమ్మాయి చనిపోయింది అనే విషయం తెలియడం వంటి విషయాలతో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది.

ఇక ఇంటర్వెల్ తర్వాత చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అని హీరో అతని స్నేహితుల బృందం కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే రొటీన్ కి భిన్నంగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చేలా ఉండడం గమనార్హం. నిజానికి దర్శకుడికి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే.

అంతలా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల ప్రేక్షకులు ఊహకు అందకుండా కథ నడిపించడంలో దర్శకుడికి ఫుల్స్ మార్క్స్ పడతాయి. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో, సమాజంలో ఇంకా పట్టి పీడిస్తున్న ఒక సమస్యను టచ్ చేసిన విధానం ఆలోచింప చేసేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

Rating -3/5

Exit mobile version