Site icon Prime9

Rahul Sipligunj: నెట్టింట రజనీకాంత్‌ ఫోటో వైరల్‌! – నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే…

Rahul Sipligunj on Rajinikanth

Rahul Sipligunj Shared a Incident with Rajinikanth: రాహుల్‌ సిప్లిగంజ్‌.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు. తెలుగు గాయకుడైన రాహుల్‌ ‘ఆర్‌ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆస్కార్‌ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నాడు. దాంతో ఒక్కసారిగా రాహుల్‌ సిప్లిగంజ్‌ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్‌ను ఇప్పటికే ఓ విషయం బాధిస్తోందట. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. తన అభిమాన హీరో, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో దిగిన ఓ ఫోటో తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాడు. అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇంతకి ఏమైందంటే… రాహుల్‌ సిప్లిగంజ్‌ సింగర్‌ మాత్రమే కాదు నటుడు, యూట్యూబ్‌ స్టార్‌ కూడా. ప్లే బ్యాక్‌ సింగర్‌గా తన గాత్రంతో ఎంతోమందిని అలరిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై తన నటనతో మెప్పిస్తు్నాడు. ఇటీవల అతడు నటించిన చిత్రం రంగమార్తాండ. డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మనందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ టైంలో ప్రకాశ్‌ రాజ్‌తో తనకు మంచి పరిచయం ఏర్పడిందన్నాడు.

“రంగమార్తాండ మూవీ షూటింగ్‌ టైం ప్రకాశ్‌ రాజ్ సర్‌, రమ్యకృష్ణ మేడంతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అప్పుడే నేను సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి వీరాభిమానిని అని ప్రకాశ్‌ రాజ్‌కు తెలిసింది. దాంతో ఒకరోజు ఆయన నన్ను పిలిచి ‘రేపు నేను రజనీకాంత్‌ సినిమా షూట్‌కి వెళ్తున్నా. నువ్వు కూడా వచ్చేయ్‌’ అని అన్నారు. అలా రజనీ సర్‌ అన్నాత్తై మూవీ షూట్‌కి వెళ్లాను. అక్కడ రజనీ సర్‌కు నన్ను పరిచయం చేశారు. వెంటనే నేను రజనీ సర్‌ కాళ్లకు నమస్కారం చేశాను. ఆయనపై ఉన్న నా ఇష్టాన్ని గమనించిన ఆయన నాతో ఫోటో దిగేందుకు అంగీకరించి ఫోటో దిగారు. అయితే అప్పుడు అన్నాత్తై షూటింగ్‌ జరుగుతున్న తరుణంలో రజనీ సర్‌ మూవీ లుక్‌లో ఉన్నారు. అయినా కూడా ఆయన నాకు సెల్ఫీ ఇచ్చారు.

అయితే దీన్ని అప్పుడే ఎక్కడ పోస్ట్‌ చేయొద్దని, ఇంకా ఈ సినిమాలో తన లుక్‌ రివీల్‌ కాలేదని ఆయన చెప్పారు కూడా. ఆయనను కలిశాక నేను ఓ 10 రోజులు వెయిట్‌ చేశాను. ఆనందం పట్టలేక ఆయనతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశా. అన్నాత్తైలో రజనీ లుక్‌ రివీల్‌ కావడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయ్యింది. అది చూసి అన్నాత్తై మూవీ టీం, నిర్మాణ సంస్థ కంగారు పడింది. దీనిపై పెద్ద చర్చ జరిగింది. దాంతో వెంటనే నేను ఆ ఫోటో డిలిట్‌ చేశా. కానీ నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నాకు తెలిసి నా జీవితంలో నేను చేసి అతిపెద్ద తప్పు అదే. ఇప్పటికీ ఈ విషయం నన్ను బాధిస్తోంది” అంటూ రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Exit mobile version