Ghanta Chakrapani: అంబేద్కర్ వర్సిటీ వీసీగా చక్రపాణి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Professor Ghanta Chakrapani Appointed as BRAOU VC: తెలంగాణ‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం వైస్ ఛాన్స్‌ల‌ర్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు వెల్ల‌డించింది. ఈ ప‌దవిలో చ‌క్ర‌పాణి మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ఈ మేరకు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. గవర్నర్, ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ ఆదేశాల మేరకు ఘంటా చక్రపాణిని బీఆర్ఏఓయూ వైస్ ఛాన్సలర్‌గా నియమించినట్లు వెల్లడించారు.

నేపథ్యం ఇదీ..
ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బయోలాజికల్ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి సోషియాలజీ ఆఫ్ రిలిజియన్‌లో పీహెచ్‌డీ చేశారు. సోషియాలజీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన చక్రపాణి ఓపెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పని చేస్తూనే తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. గ‌తంలో అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో సోషియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెస‌ర్‌గా చ‌క్ర‌పాణి విధులు నిర్వ‌ర్తించారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మ‌న్‌గా ఘంటా చ‌క్ర‌పాణి సేవ‌లందించారు.