President Droupadi Murmu advises medical professionals to serve in interior parts of country: కొత్తగా వైద్య వృత్తిలోకి వచ్చిన యువ వైద్యులంతా వెనకబడిన, గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో తమ సేవలు అందించేందుకు ముందుకు రావాలిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారంలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు.
వృత్తి కాదు.. సేవ
మనదేశంలో వైద్యుడిని దేవుడి ప్రతిరూపంగా భావిస్తారని, అంత గొప్ప అవకాశం దక్కినందుకు నేడు పట్టాలు అందుకున్న యువ వైద్యులంతా సంతోషించాలని రాష్ట్రపతి అన్నారు. మానవతా దృక్పథంతో తోటివారికి వైద్యసేవను అందించాలనే ఉద్దేశంతో ఈ మార్గంలోకి వచ్చిన యువ వైద్యులంతా గ్రామీణ, గిరిజన, వెనకబడిన ప్రాంతాలలోని అభాగ్యులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో యువ వైద్యుల పాత్ర చాలా కీలకమని, ఆ పాత్రను మీరంతా చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. వైద్య వృత్తి సామాజిక బాధ్యతతో కూడుకున్నదని, నిజాయితీగా పని చేసి, రోగి త్వరగా కోలుకుని ఇంటికి పంపేలా చూడాలని సూచించారు. అన్నారు.
మహిళలా వికాసంతోనే ప్రగతికి
ఉదయం ఎయిమ్స్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. మొదటి బ్యాచ్‌లో వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయటంతో బాటు నలుగురు పోస్ట్ డాక్టరల్ కోర్స్ విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. పట్టాలు పొందిన యువ వైద్యుల్లో 2/3 వంతు మహిళా డాక్టర్లు ఉండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం ప్రగతి సాధిస్తుందని, అందరికీ మరింతగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అప్పుడే ఆరోగ్య భారతం ఆవిష్కృతమవుతుందని తెలిపారు.
ఎయిమ్స్‌కు మరో పదెకరాలు: చంద్రబాబు
అనంతరం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆదివాసీ కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు చేరిన ద్రౌపది ముర్మును విద్యార్ధులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రమిస్తే ఎవరైనా ఉన్నత స్థానాలకు ఎదగవచ్చనటానికి ఆమె జీవితమే నిదర్శనమని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ.. తమ మాదిరిగా ఎయిమ్స్ కేంపస్ కోసం 183 ఎకరాలను కేటాయించలేదని, అవసరమైతే మరో పదెకరాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. మొత్తం 960 బెడ్ల సామర్థ్యం గల మంగళగిరి ఎయిమ్స్ కోసం రూ. 1618 కోట్లు వెచ్చించటం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఎయిమ్స్ కేంపస్‌కు ఎలాంటి సదుపాయాల లోటూ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలనే ప్రణాళిక కూడా ఉందని సీఎం తెలిపారు.
5 రోజుల పాటు బొల్లారంలో.. విడిది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం, గవర్నర్, మంత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21వరకు ఆమె ఇక్కడే బస చేయనున్నారు. బుధవారం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ఆమె ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఈ నెల 21 వరకు బొల్లారం ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.