Ponguleti Srinivasa Reddy says Panchayat Election Schedule Before 15th: త్వరలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 15లోపు ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు కీలక ప్రకటన చేశారు. లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అర్హులకు అందజేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల లోపు అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంక్వైరీ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కులగణన సర్వే, రిజర్వేషన్ల అంశంపై కీలక అడుగులు పడుతున్నాయి. కులగణనపై కమిషన్.. కేబినెట్ సబ్ కమిటీకి తన నివేదిక అందజేసింది.
రిజర్వేషన్లపై త్వరలో కొలిక్కి..
కులగణనపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసి.. ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రిజర్వేషన్ల అంశం కూడా కొద్దిరోజుల్లోనే కొలిక్కి రానుంది. రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పూర్తయిన తర్వాత ఏ క్షణాన అయినా స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 15 లోపు రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధం కానున్నాయి. తాము పాలనలోకి వచ్చిన ఏడాదిలోనే సాధించిన విజయాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజల్లోకి వెళ్లాలని, అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని ఎన్నికల హామీల అంశాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఓట్లు సాధించాలని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చూస్తున్నాయి.