Patnam Narender Reddy Quash Petition high court Against Lagcherla: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కింది కోర్టు ఉత్తర్వులు కొట్టి వేయాలని పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతోపాటు మెరిట్స్ అనుగుణంగా బెయిల్ పిటిషన్‌ను సైతం పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల దాడి ఘటనలో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు డిస్మస్ చేసింది. బెయిల్ పిటిషన్‌పై లోయర్ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ఆ గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ విషయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులను ఫార్మా కంపెనీ విషయంపై చర్చించాలని గ్రామానికి పిలిపించారు. ఈ సమయంలో కొంతమంది కలెక్టర్‌తో పాటు అధికారులపై దాడికి యత్నించారు. ఇందులో ప్రధాన నిందితుడిగా సురేష్‌ను గుర్తించారు. ఆ తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనతో పాటు మరో 20 మందిని అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై నమోదైన కేసును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. పట్నం నరేందర్ రెడ్డి తన రిమాండ్‌ను రద్దు చేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.