Ponguleti Srinivas: త్వరలోనే ఆటమ్‌ బాంబ్‌.. మంత్రి పొంగులేటి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Minister Ponguleti Counter To KTR Over Arrests: రాష్ట్రంలో త్వరలోనే ఆటమ్‌ బాంబ్‌ పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు.. త్వరలో ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోందని కీలక కామెంట్స్ చేశారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. భుజాలు ఎందుకు తడుముకుంటున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి సెటైర్లు వేశారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించిన పొంగులేటి.. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయన్నారు. కేటీఆర్.. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసు.. పడబోయే శిక్ష ఏంటో నీకు తెలుసని అన్నారు. 11 నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.

రెండు కళ్లలా అభివృద్ధి, సంక్షేమం..
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో రూ.18వేల కోట్ల పంట రుణం మాఫీ చేశామన్నారు. ఇంకా రూ.13వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని ధైర్యంగా చెబుతున్నామని, తల తాకట్టు పెట్టయిన డిసెంబర్ లోపు 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా మంత్రి అన్నారు. తాను బీఆర్ఎస్ లో చేరే సమయంలో కేసీఆర్ ను తండ్రిలా భావించి కాళ్లు మొక్కానని అన్నారు. కానీ తడిగుడ్డతో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకొనే అవసరం లేదన్నారు.