Massive Encounter in Mulugu Dist: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో వద్ద చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఆపరేషన్‌లో భాగంగా ఒక్కసారిగా ఒక్కరికొకరు ఎదురుపడడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇందులో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మావోయిస్టు కీలక నేత నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్నతో పాటు ఇతరులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పోలీసులు అధికారికంగా ఇప్పటికీ ధృవీకరించలేదు.
అయితే, ఘటనా స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్‌లో హతమైన ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ బద్రుపై రూ.20లక్షల రివార్డు ఉంది. కాగా, పీఎల్‌జీఐ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. పక్కా సమాచారంలో భద్రతా బలగాలు దాడి చేశాయి. మృతి చెందిన మావోయిస్టులలో ఇద్దరు కీలక నేతలు భద్రు, మల్లయ్యలతో పాటు కరుణాకర్, జమున, జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నారు. ఇక, వరంగల్ జిల్లాలో 14 ఏళ్ల తర్వాత ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ కావడం విశేషం.