KTR says Police crack down on ASHA workers: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను కేటీఆర్ పరామర్శించారు.
మహిళలను అరెస్టు చేసేందుకు పురుష పోలీసులకు హక్కు ఉండదన్నారు. కానీ మహిళల వద్దకు వచ్చి ఇష్టానుసారంగా కొట్టారని, భౌతికంగా దాడులు చేశారన్నారు. అయితే ఏకంగా కొంతమంది మహిళలను వస్తువుల్లా ఈడ్చుకెళ్లి వ్యాన్ లలో నెట్టేశారన్నారు. ఏసీపీతో పాటు కొంతమంది పోలీసులు ఓ ఆడబిడ్డ చీరలాగి భౌతికంగా దాడులు చేశారని ఆరోపించారు. మహిళలపై గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
ఈ ఘటన జరిగి 24 గంటలు గడిచిన ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. వెంటనే పోలీసులను డిస్మిస్ చేయాలని కోరారు. ఆశావర్కర్ల తరపున అసెంబ్లీలో నిలదీస్తామని హామీ ఇచ్చారు.