Actor Nithin Gopi : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మే 22 వ తేదీన టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు మరణించగా.. 23 వ తేదీన హాలీవుడ్, ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్ సన్ కన్నుమూశారు. ఇక మే 24 వ తేదీన బాలీవుడ్ లో ఇద్దరూ ప్రముఖులు మృతి చెందిన విషయం తెలిసిందే. యువ నటి వైభవి ఉపాధ్యాయ యాక్సిడెంట్ లో మరణించగా.. అదే రోజు మరో నటుడు మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు నితేశ్ పాండే కూడా కన్ను మూశారు. ఇక ఈ వరుస విషాదాలతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా గుండె పోటుతో చనిపోతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మొదలు ఫిబ్రవరిలో కన్నుమూసిన తారకరత్న వరకు గుండెపోటు కారణంగా మరణించిన వారే. గుండెపోటుతో చిన్న వయసులోనే అకాల మరణం చెందడం మరింత శోచనీయం.కాగా తాజాగా ఇప్పుడు మరో యువ నటుడు గుండెపోటుతో తుదిశ్వాస విడవడం చర్చనీయాంశంగా మారింది.
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు నితిన్ గోపీ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అతని వయసు 30 సంవత్సరాలు. ఛైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్ విష్ణు వర్ధన్‌తో కలిసి “హలో డాడీ” అనే సినిమాలో నటించాడు. ఇందులో విష్ణు వర్ధన్ కుమారుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నితిన్. ఆ తర్వాత ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు.
అయితే శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్ తుది శ్వాస విడిచారు. యువనటుడి అకాల మరణంతో శాండల్‌వుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమాన్లు నితిన్ ఫ్యామిలీకి సంతాపం ప్రకటించారు.
నితిన్ కేవలం సినిమాల్లోనే కాకుండా కన్నడ, తమిళ్ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన కొన్ని సీరియల్స్ లో కూడా నితిన్ గోపి నటించి మెప్పించారు. కాగా ప్రముఖ భక్తి సీరియల్ హర హర మహాదేవ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కనిపించాడు నితిన్. ఇటీవల ‘ధృవ నక్షత్రం’ సీరియల్‌కి దర్శకత్వం వహించారు కూడా. మరో కొత్త సీరియల్‌ను తెరకెక్కించేందుకు కూడా సిద్ధమయ్యాడు.