Site icon Prime9

Kaleshwaram Project: కాళేశ్వరం కీలక ఫైల్స్ మాయం.. విచారణ తుది దశలో గుర్తించిన కమిషన్!

Kaleshwaram Project Important Files Missing: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక ఫైల్స్ మాయమైన అంశం ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ విచారణ తుది దశకు వచ్చిన వేళ.. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మిస్ అవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా పని చేసిన అధికారులను విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారే చేశారేమో?
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని వెదిరె శ్రీరామ్‌ కమిషన్ ఎదుట చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ నివేదిక సమర్పించకపోవడానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల తీరే ప్రధాన కారణం అని అన్నారు. దీనిపై కమిషన్ అధికారులు సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నీటిపారుదల శాఖ అధికారులను నిలదీసింది.

అసలు దోషులెవరు?
కాగా మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణ జరుగుతున్న సమయంలో మెయింటెనెన్స్ రిజిస్టర్లు మాయం కావటం అనుమానాలకు దారి తీస్తోంది. దీని వెనక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విచారణకు హాజరైన అధికారులంతా గత సీఎం చెప్పినట్టే చేశామని జ్యుడీషియల్ కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పటంతో బాటు నాటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరునూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ విచారణకు పిలిస్తే గానీ అసలు దోషులు ఎవరో తేలుతుందని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version
Skip to toolbar