Kaleshwaram Project Commission Enquiry Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు బ్రేక్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మరింత వేగంగా కమిషన్ విచారణ సాగనుంది. నేటి నుంచి తిరిగి కమిషన్ విచారణ ప్రారంభంకానుంది. ఇప్పటికే విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 208 పేజీలతో కమిషన్ నివేదికను సిద్ధం చేయగా, చివరి దశలో భాగంగా నేతలను విచారించే దిశగా కమిషన్ రంగం సిద్ధం చేసింది.
నేటి నుంచి షురూ..
ఈ క్రమంలో నేటి నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు, కాంట్రాక్ట్ సంస్థలను కమిషన్ వరుసగా విచారించనుంది. దీనిపై ఇప్పటికే పలువురు ఫైనాన్స్ ఉద్యోగులకు కమిషన్ నోటీసులు పంపింది. ఈ దఫా విచారణలో వి.ప్రకాష్‌ను, మాజీ ఈఎన్‌సీని మరొక్కసారి బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కమిషన్ ముగించనుంది. ఇప్పటివరకు ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణను పూర్తి చేసిన కమిషన్, రూల్స్ తుంగలో తొక్కి నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. రూల్స్ పాటించని వారిపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. పనులు పూర్తి కాకుండానే బిల్లులు రిలీజ్ చేసినట్లూ కమిషన్ గుర్తించింది.
నెక్ట్స్.. హరీశ్, ఈటల?
ఇప్పటి వరకు ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, డిజైనర్లను విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన కమిషన్.. మార్చ్‌లో జరిగే విచారణకు నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు , పూర్వ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. వీరిని విచారించటం ద్వారా మరిన్ని నాటి ఆర్థిక పరమైన, పాలనాపరమైన అంశాలలో కీలక విషయాలు రాబట్టవచ్చని కమిషన్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వీరి విచారణ పూర్తయిన తర్వాత చివరగా మాజీ సీఎంను విచారించాలని కూడా ఇప్పటికే కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కీలక పాత్ర ఆయనదే..
కాళేశ్వరం తన మానస పుత్రిక అని, ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ తానేనని పలుమార్లు కేసీఆర్ ప్రకటించుకోవటం, ఇప్పటి వరకు జరిగిన విచారణలో భాగంగా పలువురు కాళేశ్వరం ఇంజనీర్లు, అధికారులు కీలక నిర్ణయాలన్నీ సీఎం హోదాలో కేసీఆర్ తీసుకున్నారని చెప్పటంతోనే ఆయనను విచారించాలని కమిషన్ భావిస్తోంది.