Site icon Prime9

JC Prabhakar Vs Adinarayana Reddy: ఫ్లైయాష్ ట్రాన్స్‌పోర్టు అంశంపై సాగుతున్న రగడ.. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను.. సీఎం

Fly Ash Controversy cm chandrababu warning: రాష్ట్రంలో ఏ వ్యక్తులైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఫ్లై యాష్ అంశంలో సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. దీనిపై బుధవారం మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, ముఖ్యంగా కూటమి నేతలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

వివాదంపై సీఎం ఆరా
కడప జిల్లా ఆర్టీపీసీ ఫ్లైయాస్‌ వివాదం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సాగుతున్న వివాదంపై సీఎం ఆరా తీశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గవద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ సిమెంట్‌ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్‌ రవాణా చేసే కాంట్రాక్ట్ పని విషయంలో ఇరువర్గాలు పోటీకి దిగాయని జిల్లా అధికారులు సీఎంకు వివరించారు. ఆర్టీపీపీ జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది కనుక తమ తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలోనే ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ పట్టు బడుతుండగా, తాడిపత్రి నియోజక వర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి ఈ బూడిద తరలిస్తున్నారని, కనుక ఈ విషయంలో తమకూ హక్కు ఉంటుందని జేసీ వర్గం వాదిస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. కాగా, ఈ విషయంలో ఇరువురితోనూ సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. వివాదాలు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికలు : సీఎం
త్వరలో సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. అక్టోబరు 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా, ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు టాప్ 10లో ఉన్నాయని తెలిపారు. అక్కడి నాయకత్వాన్ని సీఎం అభినందించారు.

వారికి శిక్ష తప్పదు
‘గత ఐదేళ్లలో పార్టీ కేడర్‌కు రూ.140 కోట్ల బీమా, ఆరోగ్యం, విద్య కోసం సాయం అందించాం. టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తాం. రోడ్ల మరమ్మతులకు రూ.14 వందల కోట్లు మంజూరు చేశాం. సంక్రాంతి నాటికి ఏపీలో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తాం. యువతకు ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మనం చేసే రాజకీయం కేవలం ప్రజల కోసమే. ప్రజలను చైతన్యవంతం చేస్తూ మనం చేస్తున్న మంచి కార్యక్రమాలను వివరించాలి. ఇది సంక్షేమానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తాం. గత ఐదేళ్లు విచ్చలవిడితనంతో ఎక్కడికక్కడ భూ సమస్యలు సృష్టించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

గంజాయి విక్రయిస్తే సంక్షేమం కట్
అమరావతి, కిరణం: రాష్ర్టంలో గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేసే ఆలోచన ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దీంతో మాదకద్రవ్యాల నియంత్రణకు అవకాశం మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం మూడో సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీకి హోమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్ గా(ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూపు ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్)మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ విధివిధానాలపై సుధీర్ఝంగా చర్చించారు. సభ్యులు పలు ప్రతిపాదనలు చేశారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీల్లో మహిళా సంఘాలు, ఆశ వర్కర్లను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపొందించి విద్యార్థులకు బోధించాలని కోరారు.

Exit mobile version