India vs England 3rd T20 match England beats India by 26 runs: హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ పడింది. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన భారత్.. మూడో టీ20 మ్యాచ్లో బోల్తా పడింది. రాజ్కోట్ వేదికగా నిరంజన్ షా మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. 172 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 26 పరుగుల తేడాతో భారత్ ఓడింది. వరుస విజయాలతో ఉన్న భారత్ ఆధిక్యాన్ని 2-1కు చేసింది.
అయితే, 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడపడి చివరికి ఓటమి చవి చూసింది. ఓపెనర్ సంజు శాంసన్(3) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ(24) అనవసరమైన షాట్లు ఆడి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(14) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఇక, హార్దిక్, తిలక్ నిలకడగా ఆడుతుండగా.. రషీద్ రూపంలో బ్రేక్ పడింది. తిలక్(18)ను ఔట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. ఆ తర్వాత సుందర్(6) పరుగులకు ఔట్ అయ్యాడు. ఇక, హార్దిక్, అక్షర్ నిలకడగా ఆడుతూ విజయంపై ఆశలు పెంచారు. కానీ 18వ ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో అక్షర్(15), 19వ ఓవర్లో హార్దిక్(40) పరుగుల వద్ద ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
అంతకుముందు, తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బట్లర్(24), లివింగ్ స్టన్(43), రషీద్(10) రాణించగా.. బ్రూక్(8), జేమ్ స్మిత్(6), ఒవర్టన్(0), కార్స్(3), ఆర్చర్(0) విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ రెండు వికెట్లు, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.