Honour Killing: రాష్ట్రంలో మరో పరువు హత్య.. అక్క గొంతును నరికిన తమ్ముడు!

Honour Killing in Telangana: తెలంగాణలో పరువు హత్య కలకలం రేగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ను ఆమె సోదరుడే అతి కిరాతంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. ఆమెను కారుతో ఢీకొట్టాడు. తర్వాత కిందపడిన వెంటనే కత్తితో నరికి చంపాడు.

అయితే, రాయపోల్ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌ను కానిస్టేబుల్ నాగమణి ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ నవంబర్ 1వ తేదీన యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకున్నారని, ఈ విషయంపై కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి నాగమణిపై ఆమె కుటుంబ సభ్యులు విపరీతమైన కోపంతో ఉన్నారు.

కాగా, వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ హయత్‌నగర్‌లో ఓ ఇంట్లో రెంట్ తీసుకుని నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగా విధులు వెళ్లేందుకు నాగమణి స్కూటీపై వెళ్తుండగా.. రాయపోలు- మన్నెగూడ మార్గంలో ఆమె సోదరుడు పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. కిందపడిన వెంటనే కత్తితో అతికిరాతంగా నరికి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.