Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి భారీ వర్షాలు

Heavy Rain Alert To AP For The Next Three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్రేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది.

ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూల్, అనంతపురం, వైఎస్సాఆర్ జిల్లాలో సాయంత్రం వరకు వర్షాలు పడనున్నాయని పేర్కొంది. అలాగే ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రేపు పడే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోసిన పంటలను ఇంటికి తీసుకురావాలని, వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పారు.అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ఇదిలా ఉండగా, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకార్మికులు చేపలు పట్టేందుకు సముద్రంలోపలికి వెళ్లకూడదని సూచించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని, సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.