Harish Rao Thanneeru: ఏడాది పాలనలో కాంగ్రెస్ విఫలం.. సుపరిపాలన అంటూ రేవంత్ డబ్బా

Harish Rao Thanneeru fire on congress government: కాంగ్రెస్‌ ఏడాది పాలన అన్నిరంగాల్లో విఫలమైందని.. ‘ఈ సర్కారు ఉత్త బేకారు’గా ఉందని ప్రజలు అనుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు, అసత్య ప్రచారంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో ఏ వర్గమూ వీరి పాలనను మెచ్చకోవటం లేదని తెలిసే.. ముఖ్యమంత్రి విజయోత్సవాల పేరుతో సొంత డబ్బా కొట్టుకుంటున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

అసమర్థ పాలనలో రాష్ట్రం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మంచి ఆర్థిక వృద్ధితో ముందుకు సాగిందని, కానీ ఏడాది కాంగ్రెస్ పాలనలో అది కుంటుబడిపోయిందని హరీష్ రావు విమర్శించారు. వృద్ధిరేటు పెంచే సత్తా లేక, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక ముఖ్యమంత్రి విపక్షాలను తిడుతున్నారని ఆరోపించారు. ఆడరాక మద్దెల ఓడు అనే సామెతకు సీఎం మాటల్ని మించిన నిదర్శనం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తుశుద్ధి, ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదని విమర్శించారు.

నిజాలే మాట్లాడరా?
కాంగ్రెస్ పాలన కుడి ఎడమల దగా దగా అన్నట్లుగా ఉందన్నారు. రూ.7లక్షల కోట్ల అప్పు చేశామని తమ మీద నెపాలు వేస్తూనే ఏడాది గడుపుకుని వచ్చిన కాంగ్రెస్ వైఖరి గెబెల్స్ మాదిరిగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయని, అందులో దాచేదేమీ లేదన్నారు. కాగ్ నివేదికల్లోనూ ఈ వివరాలు ఉంటాయని వివరించారు. నాటి సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్కకు రాష్ట్ర అప్పుల మీద స్పష్టమైన అవగాహన ఉందని, తమ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు రూ.4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా తాను లెక్కలతో సహా నిరూపించాననీ, ఇప్పటికే అదే మాట చెబుతున్నానని స్ఫష్టంచేశారు.

విజయోత్సవాల వేళ.. ఎన్‌కౌంటర్లా?
కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది? అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు.. మరోవైపు బూటకపు ఎన్ కౌంటర్‌లు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని హరీష్‌రావు ఆరోపించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ఆయన ఎద్దేవా చేశారు. బూటకపు వాగ్ధానాలు, బూటకపు ఎన్‌కౌంటర్‌లు అంటూ మండిపడ్డారు.