Four National Panchayat Awards in ap: గ్రామీణాభివృద్ది విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న నూతన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధిలో ఇప్పటి వరకు అనుసరించిన మూస ధోరణులకు భిన్నంగా.. ఆయా గ్రామాల అవసరాలు, ప్రాధాన్యతలు, సౌకర్యాల పరంగా వాటిని అభివృద్ధి చేయాలని జనసేనాని సూచిస్తూ, అందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
నాలుగు విభాగాల్లో అవార్డులు
శుక్రవారం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలలో నాలుగు విభాగాలలో ఏపీకి చెందిన గ్రామాలు ఎన్నికయ్యాయి. వీటిలో హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం ఎంపిక కాగా, వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి, సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామాలు ఎంపికయ్యాయి.
పవన్ హర్షం
అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలలో ఏపీకి చెందిన 4 పంచాయితీలుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మొట్టమొదటి సారిగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరీలో 4 జాతీయ అవార్డులను మన గ్రామ పంచాయతీలు సాధించడం ఆనందంగా ఉంది. ఈ ఘనత స్థానిక సంస్థల బలోపేతం, గ్రామాలు స్వయంసమృద్ధి సాధించే దిశగా, పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతూ, స్థానిక పరిపాలనను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనం. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు, సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
హోం మంత్రి స్పందన
కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రెండు తమ జిల్లాకు దక్కటం మీద ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆనందం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం నాయకత్వంలో సాగుతున్న సుపరిపాలనకు ఈ అవార్డులు నిదర్శనమని అన్నారు. తన నియోజకవర్గం పాయకరావుపేటలోని న్యాయంపూడి గ్రామపంచాయతీ, అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామ పంచాయతీ కూడా ఉండడం గర్వకారణమంటూ అధికారులను అభినందించారు.