Perni Nani: ఆ కేసులో అరెస్ట్ తప్పదా.. అడ్రస్ లేని మాజీ మంత్రి పేర్ని నాని.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్!

Former Minister Perni Nani’s Family Goes into Hiding: ఏపీలో మాజీ మంత్రి పేర్ని నానితో పాటు అతని కుటుంబ సభ్యులు కనిపించడం లేదని అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నిత్యం మీడియా ముందు నీతి వ్యాఖ్యలు మాట్లాడే పేర్ని నాని అడ్రస్ లేడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన గ్రామాన్ని వదిలిపెట్టిపోయినట్లు వెల్లడించారు. తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయారని, అక్కడే ఉండొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు, సతీమణి ఎవరూ కనిపించడం లేదంటూ ఆరోపించారు.

కాగా, రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారం కేసులో పేర్ని నాని పూర్తిగా కార్నర్ అయ్యారా? ఆయన అరెస్ట్ తప్పదా? అంటూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. తన భార్య, తల్లి పేరు మీద ఉన్న గోదాంలలో 5 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం మిస్సింగ్ అయినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పౌరసరఫరాల అధికారుల ఫిర్యాదు మేరకు ఈనెల 10న పేర్ని నాని భార్య జయసుధతోపాటు గోదాం మేనేజర్ మానసతేజపై కేసు నమోదైంది. అయితే ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్న నిందితుల జాడ దొరకలేదు. అడ్వకేట్‌లతో మాత్రమే టచ్‌లో ఉన్న వీరంతా ఎవరికీ దొరక్కకుండా దూరంగా ఉంటూ కోర్టుల ద్వారా డిఫెన్స్ గేమ్ ఆడుతోంది.

నోటీసులు ఇవ్వడానికి వెళ్లినా పట్టా లేకపోవడంతో చేసేది ఏమీలేక ఇంటి గోడలకు పోలీసులు నోటీసులు అంటించారు. విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు తనపై జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని హైకోర్టులో నాని పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలు, దురుద్ధేశంతో తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. అయితే ఈ క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో మంగళవారం విచారించింది.

ఇందులో భాగంగానే 22న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. పేర్ని నాని బేఖాతరు చేశారని ఏపీ ప్రభుత్వం హైకోర్టు కు తెలపింది. ఇప్పటికే నోటీస్ కాలపరిమితి ముగిసిందని, మళ్లీ నోటీసులు ఇస్తే విచారణకు వెళ్లి తీరాలని, క్వాష్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని హైకోర్టు నానిని ఆదేశించింది. అలాగే పేర్ని నాని భార్య కూడా బియ్యపు కేసులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జిల్లా కోర్టులతో విచారణ జరిగింది. కేసు డైరీ సమర్పించలేదంటూ విచారణను కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది.