Site icon Prime9

AP Deputy CM Pawan Kalyan: గిరిజన గూడేలలో రోడ్లకు శ్రీకారం.. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి

Deputy CM Pawan Kalyan visit to Pinakota Panchayat Ballagaru: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చే వరకు తాను రాజకీయాల నుంచి రిటైర్ కానని, చిట్టచివరి గిరిజన గూడేనికీ ఇకపై డోలీ అవసరం రాకుండా ఉండేలా వసతులు కల్పించి తీరతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మన్యంలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా బల్లగరువు గ్రామంలో 13 రహదారులకు సంబంధించిన పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

కాలినడకన పర్యటన..
జోరు వానను సైతం లెక్కచేయకుండా బల్లగరువు, గుమ్మంతి గ్రామాల పర్యటనకు బయలుదేరిన జనసేనాని.. బల్లగరువు కొండపై ఉన్న గిరిజనుల నివాసాలను పరిశీలించేందుకు కాలినడకన అక్కడికి వెళ్లారు. తమ బాధలు వినటానికి స్వయంగా వచ్చిన పవన్‌కు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం వారితో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేయటంతో బాటు సంప్రదాయ డోలును కాసేపు వాయించారు.

మీకోసమే.. ఈ 350 కోట్లు
వంద మంది ఉన్న ప్రతి గిరిజన గూడేనికీ రోడ్డు వేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని, జనవరిలో రహదారుల నిర్మాణానికి కేంద్రం రూ.250 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. అల్లూరి జిల్లాలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ నిధులు రూ.105 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు ఇకపై ఉండకూడదని, ఏపీని డోలీ రహిత రాష్ట్రంగా మార్చుతామని, ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం కూడా సాయం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వంలో తాను భాగస్వామినయ్యానంటే.. ప్రతి గిరిజన యువకుడూ భాగమైనట్లేనని అన్నారు.

అందుకే వచ్చా..
గిరిజనుల ఆవేదన, బాధ తెలుసుకునేందుకే ఈ పర్యటనకు వచ్చానని, తాను ఎన్నికల కోసమో, ఓట్ల కోసమే లెక్కలు వేసుకునే నేతను కాదని పవన్ తెలిపారు. బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో 19 రకాల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గిరిజన యువత తలుచుకుంటేనే మార్పు సాధ్యం అవుతుందన్నారు. ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టే పంచాయతీ సర్పంచ్‌లు తలఎత్తుకుని తిరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. తాను, సీఎం ఇద్దరం కలిసి ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు వేయాలనే పనిలోకి దిగామని, దశల వారీగా ఈ పనిని పూర్తి చేస్తామన్నారు. ఆర్థిక విషయాలు తనకు అంతగా తెలియవని, కానీ ప్రజల కష్టాలు, వాటిని పరిష్కరించే విధానం మాత్రం తెలుసునని వ్యాఖ్యానించారు. విపక్షంలో ఉండగా వైసీపీ నేతల చేత తిట్లు తిన్నామని, తమ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసినా పంటిబిగువను జనం కోసం సహించి నిలిచానని, అదే.. నేడు అధికారాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.

గంజాయి వద్దు..
గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును ఆపాలని, ఇక్కడి రైతులకు ఇకపై ప్రత్యామ్నాయ మార్గాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. దీనిని ఒక సామాజిక సమస్యగా చూస్తున్నామని, గంజాయి ఈ గ్రామాలను దాటి విదేశాలకు ఎగుమతి స్థాయికి చేరటంతో ఏపీ గంజాయికి క్యాపిటల్‌గా మారిందన్నారు. యువత, పిల్లలు చెడిపోవడానికే అదే కారణమని చెప్పారు. కడపలో ఇటీవల విద్యార్థులు దాన్ని సేవించి మత్తులో టీచర్‌పై దాడి చేసి దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. గంజాయి సాగు వదిలేసే వరకు నేను మిమ్మల్ని వదలను అని పవన్ వ్యాఖ్యానించారు.

సినీ పరిశ్రమ రావాలి..
ఏపీలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్‌కల్యాణ్‌ సినీ రంగంపై మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో చాలా సుందరమైన ప్రదేశాలున్నాయని, సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్‌లు చేయాలని సూచించారు. విదేశాల తరహాలో అనేక అందమైన ప్రదేశాలు గిరిజన, పల్లె ప్రాంతాల్లోనూ ఉన్నాయని, ఇటువంటి స్థలాల్లో షూటింగ్‌లు చేస్తే గిరిజనులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.

Exit mobile version
Skip to toolbar