Deputy CM Pawan Kalyan Powerful Words on Books and Knowledge: నా జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్‌ఎస్) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని పవన్‌కల్యాణ్ ప్రారంభించారు.
తల్లిదండ్రుల వల్ల పుస్తకాల పఠనం అలవాటు..
చెరుకూరి రామోజీరావు సాహిత్యక వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని చెప్పారు. జీవితంలో తనకు నిలబడే ధైర్యాన్ని పుస్తకం ఇచ్చిందని, అటువంటి పుస్తకాలను తన సంపదగా భావిస్తానని తెలిపారు. రెండుచోట్ల ఓడిపోయినా పుస్తకాలు ఇచ్చిన ధైర్యం తనను తిరిగి నిలబడేలా చేశాయన్నారు. చదువు రాకపోయినా పుస్తకాల ద్వారానే అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని చెప్పారు. తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని తొలిసారిగా కొన్నా..
రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంట్లో ఉండి చదివినట్లు తాను ఇంట్లో పుస్తకాలు చదినట్లు ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు. తనకు స్వతంత్రంగా నేర్చుకోగలను అనే బలం ఇచ్చింది పుస్తకమే అన్నారు. తాను ఇంటర్‌తో చదువు ఆపేశానని, కానీ చదవడం ఆపలేదన్నారు. రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానని చెప్పారు. తనకు పుస్తకాలు అంటే ప్రాణం అన్నారు. తాను ఈ స్థాయిలో నిలబెట్టిన కారణాల్లో ఒకటి పుస్తకాలు అన్నారు. ఒక పేజీ రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటే రచయితలపై గౌరవం కలుగుతుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని తాను తొలిసారిగా కొన్నానని చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ రచనలు తనను ఆలోచింపజేశాయన్నారు. గుర్రం జాషువా రాసిన ఫిరదౌసి తనను చాలా ఆకట్టుకుందన్నారు.
రచయితలు, కవులపై గౌరవం..
తన లాంటివాడు పాపులర్ ఫిగర్. కానీ జ్ఞానం ఉన్న వాళ్లు ఎక్కువుగా మాట్లాడరని చెప్పారు. తనలాంటి వాళ్లు జ్ఞానుల గురించి తెలియజేయాలన్నారు. పాపులారిటీ ఉన్న వారంతా మేథావులు కాదని, తనతో సహా అన్నారు. ఒక కథ, స్కీన్ ప్లే, ఒక స్పీచ్ రాయాలంటే ఎంతో వేదన పడాలన్నారు. విద్యార్థులు తెలుగు వ్యాకరణంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంగ్లిష్ నేర్చువాలని, మాతృభాష ద్వారానే పట్టు సాధ్యమన్నారు. మనలో సృజనాత్మకత ఉండాలంటే మాతృభాషపై పట్టు ఉండాలన్నారు. తనకు రచయితలు, కవులపై చాలా గౌరవం ఉందని చెప్పారు. విదేశాల్లో రచయితలు ఇళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన దగ్గర కూడా అలాంటి కవుల ఇళ్లకు వెళ్లాలని కోరారు. రచయితలు ఇళ్లను టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనలు చేసి అమలు చేస్తుందన్నారు. ఇలాంటి వేదికలు లేకుంటే సాహితీ వేత్తలను కలిసే అవకాశం ఉండేది కాదన్నారు. గ్రంథాలయాల ఏర్పాటుపై ఉద్యమం చేయాలన్నారు. పుస్తకం రాయాలి అంటే ఎంతో కష్టం ఉంటుందని చెప్పారు. ఇది అర్థం చేసుకుంటే మనకు రచయితలపై గౌరవం పెరుగుతుందని పవన్ పేర్కొన్నారు.
ఈ నెల 12వరకు పుస్తక మహోత్సవం..
ఈ నెల 2 నుంచి 12 వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుందని వీబీఎఫ్‌ఎస్ కార్యదర్శి మనోహర్‌నాయుడు తెలిపారు. ఈ ఏడాది 270 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పిడికిటి రామకోటేశ్వరరావు, ప్రధాన సాహిత్య వేదికకు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు, విద్యార్థుల కార్యక్రమాలు నిర్వహించే ప్రతిభా వేదికకు రతన్‌టాటా పేర్లు పెట్టినట్లు వీబీఎఫ్‌ఎస్ అధ్యక్షుడు కె.లక్ష్మయ్య వెల్లడించారు.