Deputy CM Pawan Kalyan fire on thirupati issue: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో టీటీడీ, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలున్నంత త్వరగా టీటీడీని ప్రక్షాళన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని ప్రకటించారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం నిందమోయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తిరుపతిలో పర్యటించిన పవన్.. అక్కడి అధికారులతో మాట్లాడారు. అనంతరం గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
క్షణాల్లో తొక్కిసలాట..
నిత్యం గోవింద నామంతో మారుమోగే ఆ ప్రాంతం శ్రీవారి భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు బుధవారం రాత్రి తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో ఉన్న టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో టోకెన్‌లు ఇచ్చే కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో టోకెన్లు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావటంతో.. క్యూ లైన్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కన్నుమూయగా, 48 మంది అస్వస్థతకు గురయ్యారు.
రంగంలోకి డిప్యూటీ సీఎం
ఘటనపై గురువారం రాత్రి సమాచారం అందుకున్న జనసేనాని, వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి విమానంలో తిరుపతికి చేరుకున్న పవన్ కల్యాణ్, నేరుగా బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డీఎస్పీ చెంచుబాబులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఆయన తిరుపతిలో పర్యటించి, చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
అధికారులపై ప్రశ్నల వర్షం..
పరిమితికి మించి భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి ఎందుకు వదిలారు?, టోకెన్ కేంద్రంలో రెండు వేల మందే పడతారని తెలిసీ, 2500 మందిని లోపలికి ఎందుకు పంపించారు? అంటూ పవన్ అధికారులను ప్రశ్నించారు. దీనికి వారు బదులిస్తూ.. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పద్మావతీ పార్కుకు భారీగా వచ్చారని తెలిపారు. తొక్కిసలాట జరిగిన ఎంతసేపటికి ఆంబులెన్స్ వచ్చింది? ‘ఈ టోకెన్ కేంద్రం పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?’అంటూ జనసేనాని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి అధికారులు బదులిస్తూ.. భక్తులు క్యూలో కూర్చున్నంతసేపు అంతా ప్రశాంతంగానే ఉందని, వారిలో ఒకరికి శ్వాస సమస్య తీసుకోవటంలో ఇబ్బందిగా అనిపించటంతో బయటకి తీసుకువచ్చే క్రమంలో సిబ్బంది తలుపు తీయగా, తమను లోపలికి పంపేందుకే తలుపులు తీశారని భక్తులు అపోహపడటంతో ఈ గందరగోళం తలెత్తిందని అధికారులు పవన్‌కు వివరించారు.
బాధితులకు పరామర్శ..
అనంతరం గాయపడి రుయా, స్విమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని జనసేనాని పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇది దురకష్టకరమైన ఘటన అని, ఈ కష్ట సమయంలో ప్రభుత్వం బాధితులకు తోడుగా ఉంటుందని అభయమిచ్చారు.
మీ నిర్లక్ష్యానికి మేం నిందమోస్తున్నాం..
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావుతోపాటు జేఈవో వెంకయ్య చౌదరిపై.. పవన్ తీవ్రంగా మండిపడ్డారు. వీరిద్దరూ తమ బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనను గుణపాఠంగా తీసుకోవాలని వారికి సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పారు.
టీటీడీ ప్రక్షాళన జరగాల్సిందే
ఎంతో చరిత్ర గల టీటీడీలో ఇకనైనా ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. వీఐపీలకే పరిమితం కాకుండా సామాన్య భక్తుల సౌకర్యాలు, దర్శనాలపై బోర్డు దృష్టి పెట్టాలని సూచించారు. టీటీడీ బోర్డు సభ్యులంతా ఈ ఘటనలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి.. క్షమాపణ చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
బాధ్యులపై సర్కారు చర్యలు
మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనలో తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమి, టీటీడీ సీఎస్‌వో శ్రీధర్‌లను బదిలీ చేయగా, డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అంతేగాక, ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసింది.
ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం
తొక్కిసలాసట ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగంతో బాటు వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు రూ. 5లక్షలు, గాయపడిన 33 మందికి రూ. 2 లక్షల చొప్పున పరిహారంగా ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో ఇబ్బందిపడిన 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయించనున్నారు.
మృతులు గుర్తింపు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చెందగా, ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులను విశాఖలోని తాటిచెట్ల పాలెం నివాసి లావణ్య స్వాతి(37), విశాఖలోని కంచరపాలెం నివాసి శాంతి(35), విశాఖలోని మద్దెలపాలెం నివాసి రజని(47), నరసరావుపేటకు చెందిన బాబు నాయుడు(51), తమిళనాడు సేలం జిల్లాకు చెందిన మల్లిగ(50), నిర్మల(45)గా గుర్తించారు.