Cyclone Fengal Effect: పొంచి ఉన్న పెను ముప్పు.. తీవ్ర వాయుగుండం.. రెడ్ అలర్ట్ జారీ

Heavy rain in AP and Tamil Nadu: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం సాయంత్రానికి తుఫాన్‌గా మారనుంది. కారైకల్, మహాబలిపురం మధ్య ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై సహా నాలుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 12గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపింది.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటుందని హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ, ఉత్తర కోస్తాతో పాటు పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు నేడు, రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో గంటకు 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు దక్షిణకోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 2కి.మీ వేగంతో నెమ్మదిగా కదులుతోందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలికి 110కి.మీ, నాగపట్నానికి 310 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480కి.మీ దేరంలో కేంద్రీకృతం అయినట్లు వెల్లడించింది. అయితే 48 గంటల్లో ఉత్తర ఆగ్నేయ దిశలో ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు.