Omar Abdullah: ఈవీఎంలపై పూటకో మాటా? గెలిస్తే సంబరాలు ఓకే.. ఓడితే నిందలా?

Congress inconsistent on issue of EVMs, says Omar Abdullah: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షం నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆదివారం జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తప్పుపట్టారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటూ, ఓడితే ఈవీఎంలను నిందిస్తే జనం ఆమోదించరని వ్యాఖ్యానించారు. ఓటింగ్‌ విధానంపై విశ్వాసం లేకుంటే.. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదేం స్టాండ్..
ఈవీఎంలతో ఏదైనా సమస్య ఉంటే వాటిపై పోరాటం చేయాలి తప్ప ప్రతిసారీ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఆశ్రయించటం సరికాదని ఒమర్ మండిపడ్డారు. మరి.. ఇవే ఈవీఎంల సాయంతో 100 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా సంబరాలు చేసుకుందని నిలదీశారు. కొన్ని నెలల తర్వాత మహారాష్ట్రలో ఆశించిన ఫలితాలు రాకుంటే.. విమర్శలకు దిగటమేంటని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌‌పై మండిపడ్డారు.

ఫోటీ మానేయండి..
ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదన్న ఒమర్‌.. ఓటమికి సాకుగా వాటిని చూపించకూడదన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారని అన్నారు. నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడినా, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానని గుర్తుచేశారు. నిజంగా ఈవీఎంల మీద నమ్మకం లేకుంటే పోటీ మానేయాలని సూచించారు. సెంట్రల్‌ విస్టా వంటి ప్రాజెక్టులకు తాను గతంలో మద్దతిచ్చానని, మంచి ఎవరు చేసినా దానిని ఒప్పుకోవాలని అన్నారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ.. ఈవీఎంలు, ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేయడం, వాటి స్థానంలో బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలని కోరటంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు.