CM Revanth Reddy says Former AP CM Konijeti Rosaiah inspiration to all: మాజీ సీఎం రోశయ్య అందరికీ స్ఫూర్తిఅని, ఆయన పదవి కావాలని ఏనాడూ అడిగింది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోశయ్య సూచనలతో రాజకీయాలపై అవగాహన పెంచుకున్నానన్నారు. రోశయ్యనే ఎదురిస్తూ మండలిలో నేను మాట్లాడే వాడినని గుర్తు చేశారు. రోశయ్య 16 ఏళ్లుగా ఆర్థిక మంత్రిగా పనిచేయడం కారణంగా.. 16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రశ్నించాలని రోశయ్య చెప్పేవారన్నారు.
రోశయ్య సూచనలతోనే అసెంబ్లీ కార్యక్రమాలపై అవగాహన పెంచుకున్నట్లు చెప్పారు. సీఎంలు ధీమాగా పాలించారంటే రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండడమే కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోశయ్య క్రమశిక్షణ, నిబద్ధతతో ఉండడంతో సీఎంగా ఎవరు ఉన్నా రోశయ్యకు నంబర్ 2 పొజిషన్ పర్మినెంట్‌గా ఉండేదన్నారు. ఎవరు సీఎం అయినా నంబర్ 2గా రోశయ్యనే కోరుకునేవారన్నారు. పార్టీ పట్ల ఆయనకు నమ్మకంతో 16 ఏళ్లు పనిచేయడం కూడా ఓ కారణమన్నారు. అందుకే సమయం వచ్చినప్పుడు ఆయనే నంబర్ వన్‌గా అయ్యారన్నారు.
ఆర్యవైశ్యులను ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ముఖ్యమన్నారు. చట్టసభల్లో రాజకీయ ముద్ర వేశారన్నారు. రాజకీయాల్లోనూ ఆర్యవైశ్యులకు మంచి అవకాశం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్న ఆయన విగ్రహం లేకపోవడం బాధాకరమన్నారు. అందుకే రోశయ్యకు హైదరాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.