CM Revanth Reddy and His Team To Visit Davos: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన వచ్చే ఏడాది మొదటి వారంలో స్విట్జర్జాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ ప్రాంతంలో జనవరి 20 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యటనకు సంబంధించి బడ్జెట్ విడుదల చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12.30 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్.. ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో కంపెనీల స్థాపన, పెట్టుబడులతో కలిగే ప్రయోజనాలపై వివరించనున్నారు. ప్రధానంగా ఐటీ,. ఐటీఈఎస్, మ్యాన్ ఫాక్చరింగ్, ఫార్మా తదితర పరిశ్రమలకు ప్రోత్సా హం అందించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు హాజరుకానున్నారు. అలాగే దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో దావోస్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరంలో సీఎం పాల్గొన్నారు. ఇందులో భాగంగానే అదే ఆనవాయితీ ప్రకారం..సీఎం రవేంత్ రెడ్డి మరోసారి దావోస్ వెళ్లనున్నారు. దీనికి సంబధించి పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.