CM Chandrababu: అభివృద్ధి ఫలాలను పేదలకు అందిస్తాం.. రేషన్ మాఫియా ఎక్కడున్నా వదిలిపెట్టం

CM Chandrababu says Zero tolerance for corruption in pension distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉండగా నిలిచి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా తిరిగి ప్రజలకు చేర్చుతామన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం, బొమ్మనహళ్లి మండలంలోని నేమకల్లు గ్రామంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు. పింఛన్ల పంపిణీలో పైసా అవినీతి ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసి సంపదను పెంచి, ఆ మిగులును సంక్షేమం రూపంలో పేదలకు పంచుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వాటినీ దశల వారీగా పరిష్కరిస్తామన్నారు.

పింఛన్ ఇచ్చిన సీఎం
శనివారం నేమకల్లులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం గ్రామంలోని వితంతువు రుద్రమ్మ ఇంటికెళ్లిన సీఎం ఆమె యోగక్షేమాలు విచారించారు. ఆమె కుటుంబసభ్యులతోనూ మాట్లాడి, స్వహస్తాలతో రుద్రమ్మకు పెన్షన్‌ అందించారు. తమకు ఇల్లు లేదని రుద్రమ్మ చెప్పడంతో వారికి వీలైనంత త్వరగా స్థలం కేటాయించి ఇల్లు కట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నేమకల్లులో దివ్యాంగురాలు భాగ్యమ్మ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. భాగ్యమ్మ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛను 15 వేల రూపాయలను అందించారు.

సంక్షేమంలో మనమే ముందు..
దేశంలో అత్యధిక మొత్తంలో సామాజిక పింఛను అందించే రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని, రాష్ట్రంలోని 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. గత ఐదు నెలలలో పింఛన్ల కింద ఐరూ.18 వేల కోట్లు అందించామన్నారు. గత ఎన్నికల్లో చెప్పిన విధంగా పెంచిన పింఛన్లు ఏప్రిల్‌ నుంచే అందించామని, ఇకపై పింఛను 3 నెలలకోసారి తీసుకునే వెసులుబాటును తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇకపై, మరణించిన వ్యక్తి స్థానంలో వారి జీవిత భాగస్వామికి నెలలోపే వితంతు పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు.

అనంతపురం అంటే.. అభిమానం
ఆది నుంచి తనకు కరువు జిల్లాగా పేరున్న అనంతపురం జిల్లా మీద ప్రత్యేక అభిమానముందని, తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఈ జిల్లాలోని వెనకబడిన రాయదుర్గం నియోజక వర్గం ఎడారిగా మారకుండా పలు చర్యలు తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఇందులో భాగంగానే హంద్రీనీవాపై రూ.4,500 కోట్లు ఖర్చు చేశామని, రాయలసీమలోని ప్రాజెక్టులకు రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టామని లెక్కచెప్పారు. నియోజక వర్గంలోని నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని హామీ ఇచ్చారు. పింఛను దారుల్లో కూలీలు, కార్మికులు, చేతిపని కార్మికులు.. ఇలా పలు వర్గాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

రేషన్‌ మాఫియా.. జాగ్రత్త
వైసీపీ హయాంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకోవటం తారస్థాయికి చేరిందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అలాంటి దోపిడీ దొంగల మీద కూటమి ప్రభుత్వం నిఘా పెట్టిందని, వారెక్కడ ఉన్నా వదలేది లేదని హెచ్చరించారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం పథకంలోని లోపాలను సమీక్షించి, ఆ పథకం దుర్వినియోగం కాకుండా చూసే దిశగా సర్కారు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.

సంక్షేమ బాటలో..
రాష్ట్రంలో ఇప్పటికే 198 అన్న క్యాంటీన్లు ఉన్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 50లక్షలకు పైగా ప్రజలు మూడు ఉచిత సిలెండర్ల పథకం కింద గ్యాస్‌ బుక్‌ చేసుకున్నారని, సిలిండర్‌కు వినియోగదారులు డబ్బు చెల్లించిన 48 గంటల్లో ఆ మొత్తాన్ని వారికి రిఫండ్‌ చేస్తున్నామని సీఎం వివరించారు. జగన్ నిర్వాకంతో పది లక్షల కోట్లు అప్పులున్నా.. సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు ముందు జాగ్రత్తలతో సాగుతున్నామన్నారు. గత ఐదేళ్లు ఇసుక దొరక్క లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయారని, అందుకే ఉచిత ఇసుక అందుబాటులోకి తెచ్చామని వివరించారు. గతంలో నాసిరకం మద్యంతో విచ్చలవిడిగా దోచుకున్నారని, తాము వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి వ్యాపారుల కట్టడికి ‘ఈగల్‌’ అనే వ్యవస్థను తెచ్చామని, ఇంకా ఆ గలీజు దందా మానుకోకుండా పట్టుబడితే.. అదే వారికి చివరి రోజు అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ల్యాండ్‌, శాండ్‌, డ్రగ్స్ మాఫియాకు ఏపీలో స్థానం లేదని స్పష్టం చేశారు.

జోరువానలోనూ పెన్షన్ల పంపిణీ..
తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో చిరుజల్లులు, ఓ మాదిరి వర్షాలు పడుతున్నప్పటికీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. డిసెంబరు 1 ఆదివారం రావటంతో ఒకరోజు ముందుగానే పించన్లు పంపిణీ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. పలు చోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ నేతలు, ఆయా జిల్లాల యంత్రాంగం ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికే రాష్ట్రంలో 88% పింఛన్ల పంపిణీ పూర్తయిందని, పొద్దుపోయే వరకు అది కొనసాగుతుందని సెర్ప్ రాష్ట్ర సీఈవో వీర పాండియన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల పింఛను తీసుకోలేకపోయిన 21,400 మందికి రెండు నెలల పింఛన్ కలిపి ఇచ్చామని తెలిపారు. శనివారం ఫింఛన్ పొందలేని వారు ఆదివారం దానిని అందుకోవచ్చని తెలిపారు.

తుఫానుపై సీఎం సమీక్ష
అమరావతి, కిరణం: వేగంగా దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో అమరావతి నుంచి సీఎం సమీక్ష జరిపారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీజీ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని, ఆకస్మిక వరద హెచ్చరికలున్న చోట జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక, పునరావాస కార్యక్రమాలకు రెడీ కావాలన్నారు. తుఫాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, వారికి ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు ఒరిగే ప్రమాదం ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు పాటించేలా చూడాలని తెలిపారు. విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని సూచనలు చేశారు.