Site icon Prime9

CM chandrababu: గత ఐదేళ్లలో ఏపీలో ఆర్థిక విధ్వంసం.. కొత్త పెట్టుబడులతో తిరిగి రాణిస్తాం

CM Chandrababu on AP Debts and Niti Aayog Reports: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం తాడేపల్లిలోని సచివాలయంలో నీతిఆయోగ్ నివేదిక మీద సీఎం మాట్లాడారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ల ఆర్థిక విధ్వంసానికి ఈ నివేదికే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర, దేశ భవిష్యత్‌ కోసం అందరూ ఆలోచించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకుల సమర్థత మీదే ఏపీ పురోగతి, ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని అన్నారు.

అప్పులు తెచ్చి జల్సాలు
గత ఐదేళ్లలో ఏపీకి వచ్చిన ఆదాయం ఎటుపోయిందో తెలియటం లేదని, ఆ డబ్బుతో జల్సాలు చేశారని సీఎం మండిపడ్డారు. తెచ్చిన అప్పులో కనీసం 50శాతం క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌కు పెట్టాలనే ప్రాథమిక నియమాన్ని కూడా గత సర్కారు తుంగలో తొక్కిందని వెల్లడించారు. వైసీపీ హయాంలో అప్పు తెచ్చి వడ్డీలు కట్టారని, గత ఐదేళ్లలో కమిటెడ్ ఎక్స్‌పెండీచర్‌ 11.6శాతానికి చేరిందని తెలిపారు. స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్‌ కూడా దారుణంగా పడిపోతూ వస్తోందని, వెరసి.. ఏపీని శ్రీలంక చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి అయోగ్ నివేదికలో రాష్ట్రానికి 17వ ర్యాంక్ వచ్చినట్లు సీఎం తెలిపారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో ఏపీ చివరి స్థానంలో ఉందని, వృద్ది రేటు దారుణ పరిస్థితికి చేరిందన్నారు. అన్ని ఆస్తులను తాకట్టు పెట్టారని, చివరకు ఎమ్మార్వో ఆఫీసులను కూడ తాకట్టు పెట్టినట్లు సీఎం అన్నారు.

సంపద పెంచి.. పంచాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతాయని, అయితే, సంక్షేమానికి కావలసిన వనరులు వెచ్చించాలంటే.. ముందు సంపదను సృష్టించాలని సీఎం అన్నారు. ప్రగతి బాటన నడిచే ఏ రాష్ట్రంలోనైనా తలసరి ఆదాయం పెరగాలని, కానీ, ఏపీలో గత ఐదేళ్లలో తలసరి అప్పు పెరిగిందని 2019కి ముందు ఏనాడూ ఈ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడి, తిరిగి పెట్టుబడులు సాధించేందుకు కూటమి సర్కారు విశ్వప్రయత్నం చేస్తోందన్నారు. ఈ క్రమంలోనే రుణాల రీ షెడ్యూల్‌కు వెళ్తున్నామని తెలపారు.

ఢిల్లీలో అదే అడిగారు..
ఏపీ ఆర్థిక గణాంకాలను కేంద్రంతో చర్చించినప్పుడు వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సీఎం వెల్లడించారు. ‘మీ రాష్ట్రం ఆర్థికంగా తిరిగి నిలబడుతుందా?’ అని ఢిల్లీలో పలువురు ఆర్థిక శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారని, త్వరలోనే ఈ పరిస్థితిని దారికి తెస్తామని ఏపీ తరపున వారికి చెప్పినట్లు పేర్కొన్నారు. కేంద్రం ఆదుకోబట్టి కొంతలో కొంత నయమని అన్నారు. ప్రజలంతా ఈ వాస్తవాలను గమనంలోకి తీసుకోవాలని కోరారు.

అయినా.. చేస్తున్నాం
రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అన్నా క్యాంటీన్‌లు నిర్వహిస్తున్నామని, మహిళలకు దీపం పథకం కింద ఏటా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. పింఛన్ల పెంపు, ఉద్యోగులకు సమయానికి వేతనాలు అందించే విషయంలో రాజీపడటం లేదన్నారు. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, త్వరలో మెగా డీఎస్సీ కూడ నిర్వహిస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. త్వరలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 10 లక్షల కోట్లు పెట్టుబడులతో రాష్ట్రంలోని యువతకు ఉపాధి కలుగుతుందన్నారు.

Exit mobile version
Skip to toolbar