CM Chandrababu meeting in palnadu: పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో యల్లమందలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ సారమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. సారమ్మ కూతురికి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. అలాగే సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించాలని చెప్పారు. అలాగే ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా ఆ కుటుంబానికి స్వయంగా కాఫీ తయారు చేసి ఇచ్చారు. ఈ మేరకు ఏడుకొండలు కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఇల్లు నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు.
మీ మిత్రుడిగా, మీ శ్రేయోభిలాషిగా వచ్చానని, ఎవరికి కష్టం వచ్చినా నేను కాపాడుకుంటానని చంద్రబాబు అన్నారు. మీరు చూపిస్తున్న అభిమానానికి ఎంత చేసినా తక్కువేనని చెప్పుకొచ్చారు. గత సీఎం వస్తే పరదాలు కట్టేవాళ్లని, చెట్లు కొట్టేవాళ్లని ఎద్దేవా చేశారు. అయితే నేను సాదాసీదాగా మీ ముందుకు వచ్చానని వెల్లడించారు. పేదల జీవితాల్లో వెలుగు చూడాలనేదే నా లక్ష్యమని, నేను కష్టపడేది నా కోసం కాదని, 5 కోట్ల ప్రజల కోసమని అన్నారు. పేదల ఇళ్ల పెండింగ్ బిల్లు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు.
ఇళ్ల పెండింగ్ బకాయిలన్నీ మేము క్లియర్ చేశామని, ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్బిడీతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. దీపం 1 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇప్పుడు దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని వెల్లడించారు. పేదల ఇళ్ల పెండింగ్ బిల్లులు కూడా గత ప్రభతువ్ం చెల్లించలేదన్నారు. 90 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీ జెండాను కార్యకర్తలు మోస్తున్నారన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా చేయగలరని, ఏమీ చేయలేరంటూ కొంతమంది విర్రవీగారని చంద్రబాబు అన్నారు. విర్రవీగిన వాళ్లకు ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని చెప్పారు. టీడీపీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత నాది అని, పేదలు లేని సమాజమే ఎన్టీఆర్ కల అని అన్నారు. సంపద సృష్టించడమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నానని, 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు.
అలాగే, సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడితే తాటతీస్తామని హెచ్చరించారు. త్వరలోనే అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామని, సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందిస్తామని వెల్లడించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ అణచివేశా కానీ.. పల్నాడులో హింస కొనసాగుతోందన్నారు. నా లాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయారంటే.. ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో మీరే అర్థం చేసుకోవాలని చెప్పారు.