Site icon Prime9

Health Campaign: ప్రతి 100 మందిలో ఒకరికి కేన్సర్..ఇప్పటికి 53 లక్షల మందికి టెస్టులు

Cancer Health Campaign in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను కేన్సర్ విముక్త రాష్ట్రంగా మార్చేందుకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 40 వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అందిరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు గత ఏడాది నవంబరు 14న కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి వందమందిలో ఒకరు కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో విడుదల చేసింది.

ఇవీ గణాంకాలు..
గత నవంబరు 14 నుంచి ఇప్పటివరకు 53,07,448 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 52,221 మంది కేన్సర్ అనుమానితులను ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇందులో 19,447 మందికి నోటి కేన్సర్, 15,401 మందికి రొమ్ము కేన్సర్, 17,373 మంది గర్భాశయ ముఖద్వార కేన్సర్ అనుమానితులను ఆరోగ్య శాఖ గుర్తించింది. మరోవైపు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా కేన్సర్‌ చికిత్సలకు 2019-20లో రూ.217 కోట్లు ఖర్చు పెట్టగా 2023-24లో ఆ మొత్తాన్ని రూ.624 కోట్లకు పెంచినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

పక్కాగా పరీక్షలు
గతేడాది నవంబర్ 14 నుంచి ప్రారంభమైన స్క్రీనింగ్ పది నెలల పాటు కొనసాగనుంది. ఈ క్రమంలో 18 ఏళ్లు పైబడిన వారికి నోటి, రొమ్ము కేన్సర్‌, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ పరీక్షలు చేస్తున్నారు. విస్తృత స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో 155 మంది ప్రత్యేక వైద్యులు, 238 జిల్లా ఆసుపత్రుల నిపుణులు, 3,944 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్య అధికారులు, 3,944 మంది ఎఎన్ఎంలు, 42 వేల మందికి పైగా సామాజిక ఆరోగ్య కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ముందుగా, ఆయా ప్రాంతాలలో సామాజిక స్థాయి స్క్రీనింగ్‌లో భాగంగా ఆశా కార్యకర్తలు కేన్సర్ దుష్ర్పభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మెరుగైన చికిత్స
ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం బిపి, ఆర్‌బిఎస్, హిమోగ్లోబిన్, నోటి, రొమ్ము కేన్సర్ పరీక్షలు నిర్వహించి, అనుమానిత కేసులను పై డాక్టర్లకు రిఫర్ చేస్తున్నారు. కేన్సర్ అని తేలిన తర్వాత.. అంకాలజీ యూనిట్ (పిఓయు) స్థాయిలో సూపర్ స్పెషలిస్ట్ సమక్షంలో రోగ నిర్ధారణ, చికిత్స అందిస్తారు. దీనికోసం రాష్ట్రంలో 17 పిఓయులను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో బయాప్సీ, రేడియాలజీ పద్ధతుల ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమో థెరపీ, రేడియేషన్ శస్త్రచికిత్సల వంటి వాటిని ప్రభుత్వ, అనుబంధ ఆస్పత్రులలో ఉచితంగా అందజేస్తారు. కేన్సర్ వ్యాధి సంపూర్ణ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కోరుతోంది.

Exit mobile version
Skip to toolbar