Site icon Prime9

BRS Charge Sheet: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ రిలీజ్.. 50 శాతం కూడా చేయలేదా? హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

BRS Releases Charge Sheet on Congress One Year Rule: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ అంటూ మొత్తం 18 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్‌ను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి దక్కిందని విమర్శలు చేశారు.

బీఆర్ఎస్‌లో పురోగమనం.. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం జరిగిందని హరీష్ రావు అన్నారు. దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం.. రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చడంతో పాటు పరపతి లేకుండా చేసిన రేవంత్ సర్కార్.. అంటూ విమర్శలు చేశారు. రాస్ట్రంలో రోడ్డెక్కని రంగమే లేదన్నారు. రైతులు, నిరుద్యోగులు, అవ్వాతాతలు, పోలీసులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏడాది కాలంలో రోడ్డెక్కించిందని విమర్శలు చేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అనాలోచిత ప్రకటనలు చేశారన్నారు. గచ్చిబౌలి టూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు రద్దు, ఫార్మా సిటీ రద్దు, హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల వరకే వ్యాపార, వాణిజ్యాలు బంద్, హైడ్రా పేరిట కూల్చివేతలతో అరాచకం చేయడంతో వ్యాపార సంస్థలు వెనకబడిపోయాయన్నారు. దీంతో మళ్లీ మార్పులు చేశారన్నారు. మెట్రో రైలు రద్దు కాదని.. రూట్ మార్పు అని, ఫార్మా రద్దు కాదని.. కొంతమాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పడం, 10 గంటలకు దుకాణాలు బంద్ కాదు.. 1 గంట వరకు పెంచుతానని చెప్పారన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పరిపాలనలో వైఫల్యం చెందారని, ఆయన అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారిందని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తత్తరబిత్తర అని.. ఏడాది పాలనలో హైదరాబాద్ నగరంలో ముగ్గురు
పోలీస్ కమిషనర్లు ముగ్గురు, ట్రాన్స్ కో సీఎండీలు నలుగురు, జీహెచ్ఎంసీ కమిషనర్లు ముగ్గురు, రంగారెడ్డి కలెక్టర్లు ముగ్గురు మారరని, శాఖల మధ్య సమన్వయం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న శాఖల్లోనే దారుణంగా ఉన్నాయని, గురుకులాల్లో పిల్లలు ఆహారం తిని విషమంగా మారిందని చెప్పారు. ఆయనకు పరిపాలనపై శ్రద్ధ, స్థిరత్వం లేదని విమర్శలు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రూ.15వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. అలాగే రూ.4వేల నిరుద్యోగ భృతి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వంటి ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయలేదని విమర్శలు చేశారు. ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్ లెస్ క్యాలెండర్ అన్నారు. పరిపాలనపై పట్టులేక శాంతిభద్రతలు కాపాడలేక పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.

Exit mobile version